Corona Virus: కరోనా వాక్సిన్ రేస్... అందరి కళ్లూ ఆక్స్ ఫర్డ్ వర్శిటీపైనే!

Oxford Waiting for Results on Corona Vaccine Clinicle Trails
  • క్లినికల్ దశకు చేరుకున్న వాక్సిన్ ట్రయల్స్
  • మేలో వాక్సిన్ పనితీరుపై స్పష్టమైన అవగాహన
  • విజయవంతమైతే, ఆగస్టులోనే అందుబాటులోకి వాక్సిన్
కరోనా మహమ్మారిని పారద్రోలేందుకు అవసరమైన వాక్సిన్ తయారీ కోసం ఎన్నో దేశాలకు చెందిన ఫార్మా కంపెనీలు తమవంతు ప్రయత్నాలు చేస్తుండగా, యూనివర్శిటీ ఆఫ్ ఆక్స్ ఫర్డ్ చేస్తున్న పరిశోధనలపైనే ఇప్పుడందరి దృష్టీ నెలకొనివుంది. ప్రపంచంలో క్లినికల్ ట్రయల్స్ కు చేరుకున్న నాలుగు వాక్సిన్ లలో ఆక్స్ ఫర్డ్ తయారు చేసిన వాక్సిన్ కూడా ఉందన్న సంగతి తెలిసిందే. వచ్చే నెల ప్రారంభంలో కరోనాపై పోరుకు వాక్సిన్ తయారీ దిశగా సాగుతున్న ప్రయాణం సరైన మార్గంలోనే వెళుతోందా? అన్న ప్రశ్నకు సమాధానం లభిస్తుందని యూకే శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు.

"వాక్సిన్ ట్రయల్స్ దశలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ దశ చాలా ముఖ్యం. వచ్చే నెల రెండో వారం తరువాత లేదా చివర్లో ఈ వాక్సిన్ కారణంగా మానవ శరీరంలో కరోనా రోగ నిరోధక శక్తి పెరుగుతుందని తేలితే, నా ఉద్దేశంలో మనం సక్రమంగా నడుస్తున్నట్టే. ఆపై ఆగస్టులోనే విజయాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయి" అని ఆక్స్ ఫర్ట్ యూనివర్శిటీలో మెడిసిన్ ప్రొఫెసర్ జాన్ బెల్, 'బీబీసీ' వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

వాక్సిన్ అభివృద్ధి కోసం కోట్లాది రూపాయల నిధితో యూకే బిజినెస్ సెక్రటరీ అలోక్ శర్మ ప్రకటించిన టాస్క్ ఫోర్స్ లో బెల్ కూడా సభ్యుడిగా ఉన్నారు. వాక్సిన్ ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు కనీసం ఏడాదిన్నర సమయం పడుతుందని తొలుత అంచనా వేసిన శాస్త్రవేత్తలు, ఇప్పుడు మరింత ముందుగానే వాక్సిన్ అందుబాటులోకి రావచ్చని నమ్ముతున్నారు. ఇక, వాక్సిన్ ను ప్రపంచానికి అవసరమైనంత స్థాయిలో ఉత్పత్తి చేసే శక్తి, బ్రిటన్ కు లేదని వ్యాఖ్యానించిన బెల్, వాక్సిన్ ను అభివృద్ధి చేసేందుకు మాత్రం, తమ దేశంలో అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయని అన్నారు.

కాగా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ విడుదల చేసిన వివరాల ప్రకారం, ప్రపంచంలో 70కి పైగా రీసెర్చ్ సంస్థలు కరోనా వాక్సిన్ తయారీ కోసం శ్రమిస్తున్నాయి. వీటిల్లో ఆక్స్ ఫర్డ్ తో పాటు మోడెర్నా, ఇన్నోవియో, కాన్సినో సంస్థలు మాత్రమే వాక్సిన్ ను క్లినికల్ ట్రయల్స్ స్థాయికి తీసుకుని వెళ్లాయి.
Corona Virus
Vaccine
Oxford
University
Clinicle Trails

More Telugu News