Donald Trump: 'తెలిసీ తప్పు చేసుంటే మాత్రం...': చైనాకు ట్రంప్ హెచ్చరిక!

  • చైనా కారణంగానే ప్రపంచానికి ఇబ్బందులు
  • ప్రపంచాన్ని ముందే హెచ్చరించివుండాల్సింది
  • వైట్ హౌస్ లో జరిగిన మీడియా సమావేశంలో ట్రంప్
Trump Warns China Could Face Consequences

కరోనా మహమ్మారి వ్యాప్తి వెనుక, చైనా ప్రమేయం ఉన్నా, తెలిసీ ఆ దేశం తప్పు చేసిందని తేలినా, అందుకు తగ్గ చర్యలు ఉంటాయని, వాటిని అనుభవించక తప్పదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. "ఈ వైరస్ ప్రపంచానికి అంటకుండా, చైనాలోనే ఆపే అవకాశాలున్నా, ఆ దేశం అలా చేయలేదు" అని వైట్ హౌస్ లో జరిగిన తాజా మీడియా సమావేశంలో ట్రంప్ అభిప్రాయపడ్డారు. దాని ఫలితంగానే, ప్రపంచం ఇప్పుడు తీవ్రంగా ఇబ్బందులు పడుతోందని అన్నారు.

గత సంవత్సరం డిసెంబర్ లో చైనాలోని వూహాన్ లో పుట్టిన ఈ వైరస్ కారణంగా ఇప్పటివరకూ 1.57 లక్షల మందికి పైగా ప్రజలు మరణించగా, చైనాపై చర్యల గురించి మీడియా అడిగిన ప్రశ్నకు ట్రంప్ స్పందించారు. "వారు తెలిసి చేసుంటే తప్పకుండా చర్యలుంటాయి. ఎందుకంటే తప్పు తప్పే కాబట్టి" అని అన్నారు. ఒకవేళ చైనా తప్పు చేసున్నా, దాన్ని వెంటనే సరిదిద్దుకునే ప్రయత్నం మాత్రం చేయలేదని, ముందే ప్రపంచాన్ని హెచ్చరించి వుండాల్సిందని ట్రంప్ అభిప్రాయపడ్డారు.

ఈ మహమ్మారి చూపించే ప్రభావం గురించి చైనాకు ముందే తెలుసునని, మిగతా ప్రపంచాన్ని ఆదిలోనే హెచ్చరిస్తే, తమ పరువు పోతుందని చైనా భావించివుండవచ్చని వ్యాఖ్యానించిన ట్రంప్, కరోనా వైరస్ విషయంలో ఇప్పటికే చైనా తన విచారణ ప్రారంభించిందని, ఆ విచారణలో ఏం తేలుతుందో చూస్తామని అన్నారు. తాము కూడా విచారణ జరిపిస్తున్నామని స్పష్టం చేశారు.

కాగా, వూహాన్ లో గబ్బిలాలపై ప్రయోగాలు జరుపుతూ ఉన్న ల్యాబ్ నుంచి కరోనా వైరస్ వ్యాపించిందని గతంలో అమెరికా ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో అమెరికా సైన్యం నుంచే తమ దేశంలోకి కరోనా వచ్చిందని ఆరోపించిన చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి జూవో లిజియన్, ల్యాబ్ నుంచి వైరస్ లీక్ అయిందనడానికి ఆధారాలు లేవని తేల్చి చెప్పారు. 

More Telugu News