Kerala: కరోనా కరుణించినా గుండెపోటు కాటేసింది!

  • కేరళలో 85 ఏళ్ల వృద్ధుడికి కరోనా
  • కరోనా నయమైనా ఇతర వ్యాధులకు ఆసుపత్రిలోనే చికిత్స
  • శనివారం ఉదయం తీవ్రమైన గుండెపోటు
  • కరోనా టెస్టు ఫలితం కోసం వేచిచూస్తున్న వైద్యులు
Kerala Old man dies of heart attack after corona survival

సమాజంలో జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో కరోనా వైరస్ బారినపడడం అంటే ఓ ఉత్పాతానికి గురైనట్టే భావిస్తున్నారు. దీన్నుంచి కోలుకుని బయటపడితే మృత్యుంజయుడిగానే అభివర్ణిస్తున్నారు. అయితే, ఓ కేరళ వ్యక్తి కూడా కరోనా సోకినా, వైద్యుల చలవతో సురక్షితంగా బయటపడ్డాడు. కానీ గుండెపోటు అతడి ప్రాణాలను కబళించింది.

మళప్పురం జిల్లాలో 85 ఏళ్ల వీరన్ కుట్టి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో మంజేరిలోని ప్రభుత్వ మెడికల్ కాలేజి ఆసుపత్రిలో చేరాడు. అక్కడి వైద్య సిబ్బంది మెరుగైన చికిత్స అందించడంతో వీరన్ కుట్టి కోలుకున్నాడు. చివరి రెండు కరోనా టెస్టుల్లో నెగెటివ్ వచ్చినా, వృద్ధాప్య సంబంధ వ్యాధులకు చికిత్స పొందుతూ ఆసుపత్రిలోనే ఉన్నాడు. అయితే శనివారం వేకువజామున తీవ్ర గుండెపోటు రావడంతో వీరన్ కుట్టి ప్రాణాలు వదిలాడు.

కాగా, వీరన్ కుట్టి నుంచి మరోసారి శాంపిల్స్ సేకరించిన వైద్యులు, ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. కేరళలో ఇప్పటివరకు 396 మందికి కరోనా నిర్ధారణ కాగా, ముగ్గురు మరణించారు. వాస్తవానికి భారత్ లో మొదట కరోనా ఉనికి వెల్లడైన రాష్ట్రాల్లో కేరళ ఒకటి. అయితే, పకడ్బందీ చర్యలతో కేరళలో కరోనా వ్యాప్తి గణనీయంగా తగ్గింది.

More Telugu News