UK: లండన్ లో కరోనాతో భారతీయ సంతతి మహిళ మృతి.. అంతిమ సంస్కారానికి ఆన్‌లైన్‌లో విరాళాలు!

For an Indian wome funeral Britishers Contribute 6000 Pounds
  • లండన్ లో కరోనాతో చనిపోయిన భారతీయ సంతతి మహిళ 
  • కుమార్తె కరోనాతో ఆసుపత్రిలో వెంటిలేటర్ పై వుంది
  • అంతిమ సంస్కారం కోసం చొరవ తీసుకున్న స్నేహితురాలు
ఓ భారతీయ సంతతి మహిళ అంతిమ సంస్కారం నిర్వహణ ఏర్పాట్ల కోసం ఆన్‌లైన్‌లో ఫండ్ కోసం ప్రయత్నిస్తే దాతల నుంచి అనూహ్య స్పందన లభించింది. తద్వారా 6 వేల బ్రిటీష్ పౌండ్లు సమకూరాయి. భారతీయ కరెన్సీలో దీని విలువ ఏకంగా 5 లక్షల 74 వేల రూపాయల పైమాటే.

వివరాల్లోకి వెళితే.. కరోనా వైరస్ బారినపడి అనసూయ చంద్రమోహన్ (60) అనే మహిళ లండన్ లో చనిపోయింది. ఆమె కుటుంబ సభ్యులు యూకేలోనూ, భారత్ లోనూ పలు చోట్ల వున్నారు. మరోపక్క  ఉన్న ఒక్కగానొక్క కుమార్తె, స్టాఫ్ నర్సు కూడా అయిన జెన్నీఫర్ అక్కడే కరోనాతో ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతోంది. ప్రస్తుతం ఆమె వెంటిలేటర్స్ పై వుంది. ఈ పరిస్థితుల్లో ఆమెకు అంతిమ సంస్కారానికి ఏ మార్గం అనుసరించాలన్న సమస్య తలెత్తింది.

ప్రస్తుతం కరోనా విపత్తు నేపథ్యంలో మృతదేహాన్ని ఎక్కువ రోజులు ఉంచడం సాధ్యం కాదని ఆసుపత్రి వర్గాలు స్పష్టం చేశాయి. ఈ పరిస్థితుల్లో జెన్నీఫర్ సహచర ఉద్యోగిని అయిన ఎవలిన్ నాడార్ ఈ వారం మొదట్లో ఆన్‌లైన్‌లో ఫండ్ కోసం అర్థించారు.

'అనసూయకు ఆమె కుటుంబ సభ్యులు గౌరవప్రదమైన రీతిలో అంతిమ వీడ్కోలు పలకడం అవసరం. అలాగే మృత్యువుతో పోరాడుతున్న జెన్నీఫర్ కు ఆమె తల్లి చివరి చూపు దక్కేలా చేయడం మన బాధ్యత. ఇప్పుడున్న కష్టకాలంలో ఇందుకోసం భారీ మొత్తం వ్యయం చేయాలి. అందుకే దాతల సాయాన్ని అర్థిస్తున్నా' అంటూ ఎవలిన్ చేసిన అభ్యర్థనకు దాతల నుంచి మంచి స్పందన వచ్చింది.

'దాతల స్పందనకు కృతజ్ఞతలు. అంతిమ సంస్కారానికి చాలినంత మొత్తం విరాళాల రూపంలో వచ్చింది. అనసూయ కుటుంబ సభ్యుల తరపున సాయం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను' అని చెబుతూ, 'మరోపక్క జెన్నిఫర్ పరిస్థితి ఏమీ బాగోలేదు. ఆమె త్వరగా కోలుకోవాలని మీరందరూ ప్రార్థించండి' అంటూ ఎవలిన్ కోరారు.
UK
online donations
anasuya chandramohan
family in london

More Telugu News