Team India: మోకాలు విరిగినా... 2015 వరల్డ్‌ కప్‌లో ఆడాను: షమీ

  • తొలి మ్యాచ్‌లోనే గాయమైంది
  • రోజూ మూడు పెయిన్ కిల్లర్స్ తీసుకున్నా
  • ధోనీ ఇచ్చిన స్ఫూర్తితో టోర్నీలో కొనసాగా
Played 2015 WC with fractured knee says Shami

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఆతిథ్యం ఇచ్చిన  2015 వన్డే వరల్డ్‌కప్‌లో తన మోకాలికి ఫ్రాక్చర్ అయిందని, అయినా ఆ టోర్నీ మొత్తం ఆడానని  భారత జట్టు టాప్ పేసర్‌ మహ్మద్‌ షమీ పేర్కొన్నాడు. గాయంతోనే బౌలింగ్  చేయడంతో మోకాలిలో వాపు వచ్చేదని, ప్రతి రోజు వైద్యులు చీము తీసి డ్రెస్సింగ్ చేసేవారన్నాడు. రోజూ మూడు పెయిన్ కిల్లర్స్ ఇచ్చేవారని చెప్పాడు. సెమీఫైనల్‌కు ముందు పరిస్థితి మరింత ఇబ్బందిగా మారిందన్నాడు.  అయితే, ధోనీ తనలో ఆత్మవిశ్వాసం నింపడంతో బరిలోకి దిగానని చెప్పాడు.

 ‘ప్రపంచ కప్‌ తొలి మ్యాచ్‌లోనే నా మోకాలికి గాయమైంది. మ్యాచ్‌ తర్వాత నడిచే పరిస్థితి కూడా ఉండేది కాదు. ప్రతి రోజు వైద్యులు చికిత్స అందించేవారు. మూడు పెయిన్‌ కిల్లర్లు ఇచ్చేవారు. అలానే ఏడు మ్యాచ్‌ల్లో బరిలోకి దిగా. కానీ సిడ్నీలో ఆస్ట్రేలియాతో సెమీఫైనల్‌కు ముందు నా గాయం మరింత తీవ్రమైంది. ఈ నొప్పి భరించడం నా వల్ల కాదు ఇక ఆడలేనని సహచరులకు చెప్పా.

కానీ, టీమ్ మేనేజ్‌మెంట్‌, కెప్టెన్ ధోనీ నా సామర్థ్యంపై నమ్మకం ఉంచారు. ఇలాంటి మ్యాచ్‌లో కొత్త బౌలర్‌తో ఆడించడం మంచిది కాదని ధోనీ నాలో స్ఫూర్తిని నింపాడు. దాంతో పెయిన్‌ కిల్లర్స్‌ తీసుకుని బరిలోకి దిగా. తొలి ఐదు ఓవర్లలో 13 రన్స్‌ ఇచ్చా. నొప్పి పెరగడంతో  ధోనీకి చెప్పి వెళ్లిపోదామని అనుకున్నా. కానీ పార్ట్‌ టైమర్స్‌తో బౌలింగ్ చేయిస్తే ఎక్కువ పరుగులు ఇస్తారు. నువ్వు 60 పరుగులకు మించి ఇవ్వకు.. అంటూ నాలో ఉత్సాహాన్ని నింపాడు’ అని షమీ పేర్కొన్నాడు.

గతంలో ఎప్పుడూ ఇలాంటి దారుణ పరిస్థితులను ఎదుర్కోలేదని షమీ చెప్పాడు. తన మోకాలిలో 4 మిల్లీ మీటర్ల మేరకు ఎముక విరిగిందన్నాడు. దీంతో తన కెరీర్‌ ముగిసిపోయిందని చాలా మంది హెచ్చరించారన్నాడు.  అయితే, అదృష్టంకొద్ది ఆ టోర్నీ తర్వాత శస్త్ర చికిత్స విజయవంతం కావడంతో ఈ స్థాయిలో ఉన్నానని షమీ చెప్పుకొచ్చాడు.

More Telugu News