Corona Virus: కరోనా చికిత్సలో ఫలితం ఇస్తున్న ప్లాస్మా థెరపీ!

  • ఢిల్లీలో ఈ  చికిత్సకు బాగా స్పందిస్తున్న వ్యక్తి
  • ప్రస్తుతం వెంటిలేటర్ పై  ఉన్న రోగి
  • నేడో రేపో వెంటిలేటర్ తొలగిస్తామన్న వైద్యులు
Man on ventilator given plasma therapy in Delhi Doctors say responding

కరోనా వైరస్‌తో తీవ్ర అనారోగ్యానికి గురైన రోగికి ఢిల్లీలోని ఓ ప్రముఖ  ప్రైవేట్ ఆసుపత్రిలో ప్లాస్మా థెరపీతో చికిత్స అందిస్తున్నారు. దీనికి ఆ వ్యక్తి  బాగా స్పందిస్తున్నాడని వైద్యులు చెప్పారు. వెంటిలేటరుపై ఉన్న అతనికి ఇప్పుడు ఆ అవసరం సగానికి తగ్గిందని, ఒకట్రెండు రోజుల్లో పూర్తిగా తొలగిస్తామని తెలిపారు. కరోనా చికిత్సకు ఒక ఆప్షన్ అయిన ఈ థెరపీని క్లినికల్‌గా వినియోగించటం దేశంలో బహుశా ఇదే తొలిసారి కావొచ్చని అంటున్నారు.

కరోనా లక్షణాలు తీవ్రంగా ఉన్న 50 ఏళ్ల వ్యక్తికి అతని కుటుంబ సభ్యుల విజ్ఞప్తి  మేరకు కారుణ్య ప్రాతిపదికన (కంపాసినేట్) ఈ చికిత్స అందించామని 'మ్యాక్స్ హెల్త్ కేర్' ఆసుపత్రి ఎండీ డాక్టర్ సందీప్ బుధిరాజ చెప్పారు. ఆ రోగి తండ్రి  కరోనాతో బుధవారం చనిపోయాడన్నారు. దీంతో అతని ప్రాణాలను నిలబెట్టడానికి ఏ ప్రయత్నమైనా చేయాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారని, చివరికి ప్లాస్మా థెరపీని ప్రయోగించినా తమకు అభ్యంతరం లేదని  ముందుకొచ్చారని వెల్లడించారు.  కరోనా నుంచి కోలుకున్న వ్యక్తిని కూడా వాళ్లే కలిసి, అతని నుంచి ప్లాస్మా సేకరించేందుకు ఒప్పించారని తెలిపారు.

‘ప్లాస్మా థెరపీలో.. కరోనా నుంచి కోలుకున్న వ్యక్తి (దాత) రక్తం నుంచి ప్లాస్మాను సేకరించి.. తీవ్ర అనారోగ్యంతో ఉన్న రోగి (గ్రహీత)కి ఎక్కించాల్సి ఉంటుంది. అప్పుడు దాతలో అప్పటికే అభివృద్ధి చెందిన  ప్రతి రోధకాలు (యాంటీబాడీస్)... గ్రహీత శరీరంలోకి వచ్చి వైరస్‌కు వ్యతిరేకంగా పోరాడుతాయి. ఇదేమీ కొత్త చికిత్స కాదు. 2003లో సార్స్‌ చికిత్సలో, 1980లో స్పానిష్ ఫ్లూ చికిత్సలో ఉపయోగించారు. కానీ, మన దేశంలో ఐసీఎమ్‌ఆర్, డీసీఏ ఈ చికిత్సకు ఇంకా అధికారిక అనుమతి ఇవ్వలేదు’ అని సందీప్ వివరించారు.

More Telugu News