India: దేశంలో కరోనా తాజా లెక్కలు ఇవిగో!

  • దేశంలో 11,201 యాక్టివ్ కేసులు
  • కోలుకున్న 1748 మంది
  •  437 మంది వైరస్‌కు బలి
437 people dead in India till now

భారత్‌లో కరోనా వైరస్ ప్రతాపాన్ని చూపిస్తోంది. లాక్‌డౌన్ అమల్లో ఉన్నప్పటికీ కేసులు, మరణాల సంఖ్యకు అడ్డుకట్ట పడడం లేదు. ఈ ఉదయం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ ఇండియా) విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశంలో 11,201 కేసులు ఇంకా యాక్టివ్‌గా ఉన్నాయి. వైరస్ బారినపడిన వారిలో 1,748 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అలాగే, 437 మంది ప్రాణాలు కోల్పోయారు. కేసుల్లోనూ, మృతుల్లోనూ తబ్లిగీ జమాత్‌తో సంబంధం ఉన్నవారే అధికం కావడం గమనార్హం. మరోవైపు, తెలుగు రాష్ట్రాల్లోనూ కేసుల సంఖ్య  పెరుగుతోంది.

కేంద్ర ప్రభుత్వ కరోనా వెబ్‌సైట్ ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు 534 కేసులు నమోదు కాగా, 500 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 20 మంది డిశ్చార్జ్ కాగా 14 మంది ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య గత రెండు, మూడు రోజులుగా పదుల సంఖ్యలో పెరుగుతోంది. ఇప్పటి వరకు 700 కేసులు నమోదు కాగా, 495 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 187 మంది డిశ్చార్జ్ కాగా, 18 మంది ఈ వైరస్‌కు బలయ్యారు.

దేశంలో కరోనా బారినపడి విలవిల్లాడుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర ముందుంది. అక్కడ ఇప్పటి వరకు 3,202 కేసులు నమోదయ్యాయి. 2,708 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 300 మంది కోలుకోగా 194 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో నమోదవుతున్న కేసులు, మృతుల సంఖ్యలో సగం ముంబైలోనే నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

More Telugu News