Donald Trump: 'మన జీవితాలను మనం తిరిగి ప్రారంభిస్తున్నాం'... మూడు సూత్రాల కార్యాచరణ ప్రణాళికను ప్రకటించిన ట్రంప్

  • వైరస్ తగ్గిన ప్రాంతాల్లో నిబంధనల సడలింపు
  • పాఠశాలలు తెరిచేందుకు త్వరలో అనుమతులు
  • కొత్త కేసులు పెరగకుండా దృష్టి సారించాలన్న ట్రంప్
Trump Says 3 Phase Plan on Corona

కరోనా మహమ్మారి కాస్తంత తెరిపినిచ్చిన ప్రాంతాల్లో సాధారణ జీవనాన్ని తిరిగి నెలకొల్పాలని రాష్ట్రాల గవర్నర్లకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు. ఇప్పటికే దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలుకాగా, దాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు మూడు సూత్రాల ప్రణాళికను అమలు చేయనున్నట్టు తన కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారు.  

గురువారం నాడు వైట్ హౌస్ లో మీడియాతో మాట్లాడిన ఆయన, "మన జీవితాలను మనం తిరిగి ప్రారంభిస్తున్నాం. మన ఆర్థిక వ్యవస్థకు కాయకల్ప చికిత్సను ప్రారంభించాలి. ఇది ఒక్కరోజుతో అయ్యే పనికాదు. ఒక్కో మెట్టు ఎక్కుతూ ముందుకు వెళ్లాల్సిన సమయమిది" అని అన్నారు.

కొత్త నిబంధనల ప్రకారం, కరోనా వైరస్ వ్యాప్తి తక్కువగా ఉన్న ప్రాంతాల్లో నిబంధనలను సడలిస్తామని, అధికంగా ఉన్న ప్రాంతాల్లో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. వైరస్ మరోమారు వ్యాపించకుండా, ప్రజలంతా సామాజిక దూరాన్ని పాటిస్తూనే ఉండాలని సూచించారు. సాధారణ జనజీవనం ఇప్పట్లో సాధ్యం కాదని ట్రంప్ అభిప్రాయపడ్డారు.

 ఏ రాష్ట్రంలో ఉన్న ప్రజల ఆరోగ్య బాధ్యత ఆ రాష్ట గవర్నర్ దేనని, నిత్యమూ వారితో పరిస్థితిపై సమీక్షిస్తున్నామని అన్నారు. రాష్ట్రాల్లోని పరిస్థితిని బట్టి, అక్కడి గవర్నర్లే నిర్ణయాలు తీసుకోవచ్చని, రాష్ట్రాల స్థానిక ప్రభుత్వాలకు తోడుగా తాను నిలుస్తానని అన్నారు. వైరస్ వ్యాప్తి తగ్గి, కరోనా పరీక్షలు పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రాంతాల్లో పాఠశాలలు, వ్యాపారాలకు త్వరలోనే అనుమతి ఇస్తామని అన్నారు.

కరోనాను పారద్రోలేందుకు తొలి ప్రణాళికగా, సోషల్ డిస్టెన్సింగ్ పాటించడంతో పాటు 10 మంది కన్నా ఎక్కువ మంది గుమికూడకుండా చూడాలని, అనవసర ప్రయాణాలు వద్దని ట్రంప్ ఆదేశించారు. రెండో దశలో 50 మంది వరకూ ప్రజలు సామాజిక దూరాన్ని పాటిస్తూ, సమావేశం కావచ్చని, ప్రయాణాలకూ అనుమతి ఉంటుందని తెలిపారు. మూడో దశలో అత్యధిక అమెరికన్లు తమ పూర్వపు జీవితాన్ని గడిపేలా చూస్తామని,  కొత్తగా వైరస్ ఎవరికీ సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు.

More Telugu News