Tirumala: తిరుపతి నుంచి ఎట్టకేలకు స్వదేశానికి పయనమైన బ్రిటన్ పర్యాటకుడు!

  • గత సంవత్సరం భారత్ కు వచ్చిన క్లైవ్ బ్రయాంట్
  • మార్చి 21న తిరుమలకు వచ్చి చిక్కుకుపోయిన వ్యక్తి
  • ప్రయాణానికి కావాల్సిన పత్రాలు సమకూర్చిన బ్రిటీష్ ఎంబసీ
British Traveler Stuck in Tirupati gets Permission for Journey

తిరుమలలోని శ్రీ వెంకటేశ్వరుని దర్శనానికై వచ్చి, లాక్ డౌన్ కారణంగా ఇక్కడే చిక్కుబడిపోయిన బ్రిటన్ పర్యాటకుడు కుల్లీ క్లైవ్ బ్రయాంట్, ఎట్టకేలకు స్వదేశానికి బయలుదేరాడు. అతని ప్రయాణానికి కావాల్సిన అన్ని రకాల అనుమతులూ రావడంతో తిరుపతి నుంచి రోడ్డు మార్గాన హైదరాబాద్ చేరుకున్న బ్రయాంట్, ఆపై అహ్మదాబాద్ కు విమానంలో వెళ్లి, అక్కడ నుంచి లండన్ కు బయలుదేరిన ప్రత్యేక విమానం ఎక్కాడు.

56 ఏళ్ల క్లైవ్ బ్రయాంట్, 2019 అక్టోబర్ 29న ఇండియాకు వచ్చి, గత నెల 21న తిరుమలను సందర్శించాడు. ఆపై లాక్ డౌన్ అమలులోకి రావడంతో, బ్రయాంట్ ను తిరుచానూరులోని క్వారంటైన్ సెంటర్ కు తరలించారు. ఆపై జరిపిన పరీక్షల్లో అతనికి కరోనా నెగటివ్ వచ్చింది. క్వారంటైన్ లో ఉన్న సమయంలోనే తన పరిస్థితి గురించి బ్రయాంట్, ఎంబసీ అధికారులకు సమాచారం ఇచ్చాడు.

దీంతో అతని ప్రయాణానికి అవసరమైన అన్ని టికెట్లనూ ఎంబసీ పంపింది. అతను బ్రిటీష్ జాతీయుడేనని నిర్ధారించుకున్న చిత్తూరు అధికారులు, హైదరాబాద్ వరకూ ప్రయాణానికి అవసరమైన అద్దె వాహనాన్ని సమకూర్చి, ప్రయాణ అనుమతులు ఇచ్చారు. గురువారం సాయంత్రం అతను హైదరాబాద్ లో విమానం ఎక్కినట్టు తెలిపారు.

More Telugu News