Zoa Morani: నాలో కరోనా లక్షణాలు కనిపించిన వెంటనే చేసిన మొదటి పని అదే!: బాలీవుడ్ నటి జోయా

Actress Zoa Morani reveal how she won over corona virus
  • నాలో లక్షణాలు కనిపించగానే క్వారంటైన్‌లోకి వెళ్లా
  • యోగా నన్ను బాగా ఆదుకుంది
  • ఇప్పటికీ దగ్గు వేధిస్తోంది
తనలో కరోనా లక్షణాలు కనిపించగానే అప్రమత్తమయ్యానని, కుటుంబ సభ్యులకు దూరంగా ఓ గదిలోకి వెళ్లి స్వీయ నిర్బంధంలో ఉన్నానని బాలీవుడ్ నిర్మాత కుమార్తె, నటి జోయా మోరానీ వివరించింది. వైరస్ బారినపడిన ఆమె కోలుకుని డిశ్చార్జ్ అయింది. ఈ సందర్భంగా తన అనుభవాలను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది.

గత నెల 18న తనలో వైరస్ లక్షణాలు కనిపించాయని, తొలుత జ్వరం వచ్చిందని, వారం తిరిగే సరికి దగ్గు, తలనొప్పి ఎక్కువైందని తెలిపింది. ఆ తర్వాత రోగ నిరోధక శక్తి దెబ్బతిన్నట్టు తనకు అర్థమైందని వివరించింది. దీంతో తులసి నీళ్లు, పసుపు కలిపిన పాలు వంటివి తీసుకుని రోగ నిరోధక శక్తిని పెంచుకునే ప్రయత్నం చేశానని, అలాగే, తన నుంచి వైరస్ మరింత మందికి సోకకుండా కుటుంబ సభ్యులకు దూరంగా ఓ గదిలోకి వెళ్లి సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉండిపోయానని వివరించింది.

ఆ తర్వాత ఆసుపత్రిలో చేరానని, తనకు చికిత్స అందించిన వైద్యులు తనపై ఎంతో ప్రేమ చూపారని, తనలో ఆశావహ దృక్పథాన్ని పెంచారని ప్రశంసించింది. ఎవరికి ఎలాంటి పరిస్థితి వస్తుందో దేవుడికి ముందే తెలుసని, గత ఆరేళ్లుగా తాను యోగా చేస్తుండడం అందుకు ఉదాహరణ అని జోయా పేర్కొంది. కరోనా లక్షణాలు ఉన్న సమయంలో సహనం కోల్పోయేదానినని, అయితే, యోగా తనలో ధైర్యాన్ని నింపిందని తెలిపింది. ప్రస్తుతం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినా మరో 14 రోజులపాటు సెల్ఫ్ క్వారంటైన్‌లోనే ఉండాలని జోయా చెప్పుకొచ్చింది. ఇప్పటికింకా పూర్తిగా కోలుకోలేదని, ఇంకా దగ్గు వస్తూనే వుందని వివరించింది.
Zoa Morani
Corona Virus
Bollywood
Actress

More Telugu News