అమెరికాలో కరోనా మరణాలు చూస్తుంటే ప్రతిరోజూ 9/11 దాడులు జరుగుతున్నట్టుంది: వర్మ

16-04-2020 Thu 18:36
  • అమెరికాలో నిత్యం వేల సంఖ్యలో కరోనా మరణాలు
  • లాడెన్ ఆత్మ కరోనాగా మారిందనుకోవడంలేదని వ్యాఖ్యలు
  • కరోనాతో పోలిస్తే లాడెన్ ఓ బచ్చా అని అభివర్ణించిన వర్మ
Ram Gopal Varma comments on corona deaths in USA
ఎలాంటి అంశంపై అయినా తనదైన శైలిలో విమర్శలు, సెటైర్లు గుప్పించడంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దిట్ట. అమెరికాలో కరోనా వైరస్ బీభత్సం సృష్టిస్తూ నిత్యం వేల మరణాలకు కారణమవుతుండడం పట్ల కూడా ఇలాగే స్పందించారు.

అమెరికాలో సంభవిస్తున్న మరణాలు చూస్తుంటే అక్కడ ప్రతిరోజూ 9/11 దాడులు జరుగుతున్నట్టుగా ఉందని అభివర్ణించారు. కరోనా మహమ్మారితో పోల్చితే ఒసామా బిన్ లాడెన్ ఓ బచ్చా అంటూ వ్యాఖ్యానించారు. అయినా, ఒసామా బిన్ లాడెన్ ఆత్మ పగబట్టి కరోనా వైరస్ రూపంలో అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటోందని భావించడంలేదని వర్మ ట్వీట్ చేశారు.

అమెరికాలో ఇప్పటివరకు 6.44 లక్షల మందికి కరోనా సోకగా, 28 వేల మందికి పైగా మరణించారు. ఇటీవల కొన్నిరోజులుగా అమెరికాలో నిత్యం 2 వేలకు మించి మరణాలు నమోదవుతున్నాయి.