USA: చైనా కదలికలు 'అణు'మానాస్పదం... మరోసారి అగ్నికి ఆజ్యం పోసిన అమెరికా!

  • లోప్ నూర్ కేంద్రంలో చైనా ప్రయోగాలు జరిపిందంటూ ఆరోపణ
  • సెన్సర్ సంకేతాలను చైనా బ్లాక్ చేసిందని వెల్లడి
  • అమెరికావి నిరాధార ఆరోపణలన్న చైనా
US report tells China breaches nuclear treaty

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా అమెరికా, చైనా మధ్య విభేదాలు మరింత రగులుకున్నాయి. వైరస్ వ్యాప్తికి మీరు కారణమంటే.. మీరు కారణం అనుకుంటూ రెండు దేశాలు ఆరోపణాస్త్రాలు సంధించుకుంటున్నాయి.

 తాజాగా ఈ అగ్నికి ఆజ్యం పోసేలా అమెరికా ఓ నివేదికను తెరపైకి తెచ్చింది. చైనాలోని లోప్ నూర్ అణు కేంద్రంలో గతేడాది యావత్తు అనుమానాస్పద కదలికలు చోటుచేసుకున్నాయని, అండర్ గ్రౌండ్ లో తక్కువ స్థాయి గల అణు ప్రయోగాలు నిర్వహించి ఉండొచ్చని అమెరికా పేర్కొంది. 'జీరో ఈల్డ్' ప్రమాణాలను చైనా తుంగలో తొక్కిందనడానికి ఈ కదలికలే ఆధారమని ఆరోపించింది.

'జీరో ఈల్డ్' అంటే గొలుసుకట్టు విస్ఫోటనాలు సంభవించని అణు ప్రయోగం. ఓ అణ్వస్త్రాన్ని ప్రయోగాత్మకంగా పేల్చినప్పుడు అది ఎలాంటి తదుపరి విస్ఫోటనాలను సృష్టించరాదు. తద్వారా పౌర అవసరాలకు సంబంధించిన అణు ప్రయోగాలే నిర్వహించేలా దేశాలను కట్టడి చేయడమే ఈ ప్రమాణం ఉద్దేశం. 1996లో సమగ్ర అణుపరీక్షల నిషేధ ఒప్పందం (సీటీబీటీ) తీసుకువచ్చిన సందర్భంగానే 'జీరో ఈల్డ్' ప్రమాణం కూడా పుట్టుకొచ్చింది. చైనా కదలికలపై అమెరికా నివేదిక తాజాగా వాల్ స్ట్రీట్ జర్నల్ లో ప్రచురితమైంది.

నిర్దిష్ట కాల వ్యవధిలో చైనాలోని ఐదు సెన్సర్ కేంద్రాల నుంచి సంకేతాల ప్రసారానికి అంతరాయం ఏర్పడిందని, 2018 నుంచి 2019 వరకు ఇది కొనసాగిందని వివరించింది. ఓ ఇంటర్నేషనల్ ఏజెన్సీ నిర్వహించే ఈ సెన్సర్ వ్యవస్థలను చైనా అణు ప్రయోగాల సమయంలో బ్లాక్ చేసి ఉంటుందని అమెరికా అనుమానిస్తోంది. చైనా నిబంధనలకు వ్యతిరేకంగా అణ్వస్త్ర ప్రయోగాలకు పాల్పడిందన్నది ఈ చర్యలతో తేటతెల్లమవుతోందని వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం పేర్కొంది.

దీనిపై చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా ఆరోపణల్లో నిజం లేదని, ఆధారాల్లేకుండా ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. చైనా ఎల్లప్పుడూ బాధ్యతాయుత దృక్పథంతో నడుచుకుంటుందని, అంతర్జాతీయ ఒప్పందాలకు విలువ ఇస్తుందని తెలిపారు.

More Telugu News