Narendra Modi: 'ఈ పిల్లలు ఎంత పెద్ద పాఠం నేర్పించారో చూడండి' అంటూ వీడియో పోస్ట్ చేసిన ప్రధాని మోదీ

  • వీడియో ట్వీట్ చేసిన ప్రధాని
  • ఇటుక రాళ్లతో కరోనా వ్యాప్తిని వివరించిన పిల్లలు
  • అచ్చెరువొందిన మోదీ
PM Modi tweets on children who makes corona awareness video

ప్రధాని నరేంద్ర మోదీ తన ట్విట్టర్ అకౌంట్ లో ఓ ఆసక్తికరమైన వీడియో పోస్టు చేశారు. అనంతరం దానిపై వ్యాఖ్యానిస్తూ, కరోనాను ఎలా కట్టడి చేయొచ్చో ఈ వీడియోలో చిన్న పిల్లలు పెద్ద పాఠం నేర్పించారని వెల్లడించారు. కరోనాను పారదోలేందుకు భౌతిక దూరం పాటించడాన్ని మించిన ఆయుధం లేదని చిన్నారులు చాటి చెప్పారని కొనియాడారు. మోదీ ట్వీట్ చేసిన ఆ 60 సెకన్ల వీడియోలో, కొందరు చిన్నపిల్లలు వరుసగా ఇటుక రాళ్లను నిలబెట్టి వాటి ద్వారా కరోనా వ్యాప్తి ఎలా జరుగుతుందో దృశ్యరూపంలో వివరించడం చూడొచ్చు.

వరుసగా నిలబెట్టిన ఇటుకల్లో ఆ చివరన ఉన్న రాయిని కూలదోస్తే అక్కడి నుంచి ఈ చివరన ఉన్న రాయి వరకు పడిపోవడం వీడియోలో కనిపిస్తుంది. ఆ ఇటుకలే మనుషులు అనుకుంటే, ఎడం పాటించకపోవడం ద్వారా ఒకరి నుంచి మరొకరికి కరోనా ఎలా సంక్రమిస్తుందో ఓ చిన్నారి తన తోటి పిల్లలకు వివరిస్తాడు. ఈ ప్రయత్నాన్ని ప్రధాని మోదీ అభినందించారు. ఆ పిల్లలు ఆడుకుంటూ ఎంత కీలక సందేశాన్నిచ్చారో చూడండి, కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో ఇదే కీలక అంశం అంటూ ట్వీట్ చేశారు.

More Telugu News