Salman Khan: నీ ఇంటి నుంచి మొదలుపెట్టి... దేశ జనాభాను తగ్గించాలనుకుంటున్నావా?: సల్మాన్ ఖాన్ తీవ్ర ఆగ్రహం

  • మెడికల్ స్టాఫ్, పోలీసులపై రాళ్లు విసిరిన వారిపై ఆగ్రహం
  • ఇలాంటి వారికి దేశంలో చోటు లేదని వ్యాఖ్య
  • లాక్ డౌన్ ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవాలని విన్నపం
Salman Khan Delivers A Strong Message Against Those Who Pelted Stones On Doctors And Police

కరోనా బారిన పడి, క్వారంటైన్ కు వెళ్లకుండా తప్పించుకు తిరుగుతున్న వారిపై బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ మండిపడ్డారు. నీ ఇంటి నుంచి మొదలు పెట్టి జనాలను చంపేయాలనుకుంటున్నావా? దేశ జనాభాను తగ్గించాలనుకుంటున్నావా? అని ప్రశ్నించారు. ఇలాంటి వారికి దేశంలో చోటు లేదని... వీరంతా వెళ్లిపోవాల్సిందేనని వ్యాఖ్యానించారు.

లాక్ డౌన్ నిబంధనలను మరింత కఠినతరం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. నిబంధనలను ఉల్లంఘించి, రోడ్లపైకి వస్తున్న వారికి బుద్ధి చెప్పాలని అన్నారు. రోడ్లపై తిరుగుతున్న వారిపై పోలీసులు లాఠీలు ఝళిపిస్తున్నారంటూ వస్తున్న వార్తలపై మాట్లాడుతూ, జనాలు రోడ్లపైకి రాకపోతే లాఠీలకు పని చెప్పాల్సిన అవసరం పోలీసులకు లేేదని అన్నారు. జనాలను కొడుతూ పోలీసులు ఆనందాన్ని పొందుతున్నారని అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు.

రేషన్, ఔషధాల కోసం బయటకు వచ్చేవారు విధిగా మాస్కులు, గ్లోవ్స్ ధరించాలని సల్మాన్ కోరారు. కరోనా వైరస్ కట్టడి కోసం డాక్టర్లు, పోలీసులు తమ ప్రాణాలను సైతం రిస్క్ చేస్తున్నారని చెప్పారు. 'ఇది చాలా ఆశ్చర్యకరం. నీ ప్రాణాలను కాపాడేందుకు డాక్లర్లు, నర్సులు ప్రయత్నిస్తుంటే... నువ్వు వారిపై రాళ్లు రువ్వుతున్నావు. అసలు నీవు ఎటు పోతున్నావు. డాక్టర్లు చికిత్స అందించకపోతే, రోడ్లపై పోలీసులు పట్టుకోకపోతే... నాకు ఏ ఇన్ఫెక్షన్ లేదని భావించే వ్యక్తుల వల్ల ఎందరో ప్రాణాలు కోల్పోతారు' అని అసహనం వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్ లో మెడికల్ స్టాఫ్, పోలీసులపై కొందరు రాళ్లు రువ్విన ఘటనపై స్పందిస్తూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.  

ప్రస్తుతం సల్మాన్ ఖాన్ తన తల్లి, చెల్లెల్లు అర్పిత, అల్విర, వారి పిల్లలతో కలిసి ఫామ్ హౌస్ లో ఉంటున్నారు. లాక్ డౌన్ కారణంగా అక్కడే గడుపుతున్నారు. లాక్ డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న 25 వేల మంది డైలీ వేజ్ సినీ కార్మికులకు సల్మాన్ ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు.

More Telugu News