COVID-19: కరోనా రాకుండా గుండు చేయించుకుంటున్న గ్రామస్థులు

  • నిర్మల్‌ జిల్లాలోని ముధోల్ మండలం చింతకుంట తండాలో ఘటన
  • పూజలు చేసిన యువకులు
  • ఇలా చేయడం హిందూ సంప్రదాయమని వ్యాఖ్య
coronavirus cases in telangana and superstition

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో మూఢనమ్మకాలు వద్దని నిపుణులు చెబుతున్నా కొన్ని ప్రాంతాల్లో ప్రజలు వాటినే పాటిస్తున్నారు. ఇటీవలే జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఒక్క కొడుకు ఉన్న వారు ఐదు ఇళ్ల బావుల్లోని నీటిని వేపచెట్టుకు పోస్తే కరోనా పారిపోతుందనే వింత ప్రచారం మొదలైంది. దీన్ని ఆ ప్రాంతంలో చాలా మంది పాటించారు. తాజాగా నిర్మల్ జిల్లాలో ప్రజలు గుండుకొట్టించుకుంటున్నారు. ఇలా చేస్తే కరోనా రాదన్న ప్రచారం మొదలైంది.

ముధోల్ మండలం చింతకుంట తండాలో 25 మంది యువకులు కులదైవానికి పూజలు చేసి, గుండు చేయించుకున్నారు. ఒకరి తర్వాత ఒకరు గుండు కొట్టించుకుని ఫొటోలు కూడా దిగారు. ఇలా చేస్తే కరోనా రాదని వారు ఎంతో నమ్మకంగా చెప్పడం గమనార్హం.  

ఇలా చేస్తే తమ గ్రామంలోనూ కరోనా రాదని ఓ గ్రామ పెద్ద మీడియాకు తెలిపాడు. హిందూ సంప్రదాయం ప్రకారం పుణ్య క్షేత్రాలకు వెళ్లినా, ఇంట్లో ఎవరైనా చనిపోయినా గుండు చేయించుకుంటామని, అదే ఆచారం ప్రకారం కరోనా రాకుండా ఇప్పుడు గుండు చేయించుకుంటున్నామని చెప్పాడు. కుల దైవాలకు భక్తి, శ్రద్ధలతో పూజలు కూడా జరిపించామని తెలిపాడు.

More Telugu News