Andhra Pradesh: క్వారంటైన్ కేంద్రంలో ఒక్కొక్కరిపై ఏపీ ప్రభుత్వం రోజువారీ ఖర్చు ఇది!

  • రోజుకు భోజనానికి రూ. 500 వరకూ ఖర్చు
  • మెనూలో బాదం, పిస్తా, జీడిపప్పుతో కూడిన పోషకాహారం
  • టెస్టింగ్ సామర్థ్యాన్ని మరింతగా పెంచుతామని వెల్లడి
Daily 500 Rupees Expences for a person in Quarentine Center

కరోనా వ్యాప్తి నివారణకు కృషి చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వ్యాధి సోకిన వారి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ పర్సన్స్ ను క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తోంది. ఇక క్వారంటైన్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, అనుమానితులకు కల్పిస్తున్న వసతుల విషయంలో ఏ మాత్రం రాజీ పడరాదని సీఎం జగన్ ఆదేశించారు. ఈ సెంటర్లలో తీసుకుంటున్న చర్యలపై అధికారులు సీఎంకు వివరించారు.

ఒక్కో కేంద్రంలో ఒక్కో మనిషికి రోజుకు భోజనంపైనే రూ. 500 వరకూ ఖర్చు చేస్తున్నామని, ప్రతి రోజూ దుప్పటి మార్చేందుకు అయ్యే వ్యయం కూడా ఇందులో కలిసుంటుందని తెలిపారు. వీరికి పోషకాహార భోజనాన్ని అందిస్తున్నామని, నిత్యమూ బాదంపప్పు, పిస్తా, జీడిపప్పు, గుడ్డు, పండ్లు మెనూలో భాగంగా ఇస్తున్నామని పేర్కొన్నారు.

దీనితో పాటు ప్రతి వ్యక్తి పారిశుద్ధ్యం నిమిత్తం రూ. 50, ఇతర ఖర్చుల కోసం మరో రూ. 50 వెచ్చిస్తున్నామని తెలిపారు. ఎవరినైనా క్వారంటైన్ చేయాల్సి వస్తే, సదరు వ్యక్తిని సమీపంలోని కేంద్రానికి తరలించేందుకు రూ. 300 వరకూ ఖర్చవుతోందని, క్వారంటైన్ ను పూర్తి చేసుకున్న వారిని ఇళ్లకు చేర్చేందుకు సగటున మరో రూ. 300 వెచ్చిస్తున్నామని అన్నారు. ప్రతి ఒక్కరినీ సాధ్యమైనంత విడివిడిగా ఉంచాలన్న ఉద్దేశంతో సింగిల్ లేదా డబుల్ రూమ్ ను ఇస్తున్నామని అధికారులు సీఎంకు తెలిపారు. ఇక ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రోజుకు 2,100 మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని, అతి త్వరలోనే టెస్టింగ్ కెపాసిటీని 4 వేలకు పెంచుతామని తెలిపారు.

More Telugu News