Bhadradri Kothagudem District: భద్రాద్రి కొత్తగూడెంలో దారుణం.. అప్పు తీర్చలేదని బాధితుడి భార్యను ఎత్తుకెళ్లి నిర్బంధించిన వ్యాపారి

  • అప్పుగా తీసుకున్న రూ. 2 లక్షల్లో రూ. 1.50 లక్షల చెల్లింపు
  • లాక్‌డౌన్ కారణంగా గడువు కావాలని కోరిన బాధితుడు
  • బాధితుడి ఇంటికొచ్చి దాడి
Lender kidnapped borrowers wife in Khammam

తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ వడ్డీ వ్యాపారి దారుణానికి తెగబడ్డాడు. వడ్డీ డబ్బులు చెల్లించలేదన్న కారణంతో బాధితుడి భార్యను ఇంట్లోంచి ఎత్తుకెళ్లి నిర్బంధించాడు. పోలీసుల కథనం ప్రకారం.. జిల్లాలోని టేకులపల్లి మండలం సులానగర్‌కు చెందిన అజ్మీరా హట్యా.. అదే గ్రామానికి చెందిన బానోత్ హన్మా అనే వడ్డీ వ్యాపారి వద్ద రూ. 2 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. తీసుకున్న మొత్తంలో ఇటీవల రూ.1.50 లక్షలు చెల్లించిన హట్యా.. మిగతా సొమ్మును త్వరలోనే ఇస్తానని చెప్పాడు.  

కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ విధించడంతో మిగతా అసలు, వడ్డీని హట్యా చెల్లించలేకపోయాడు. పరిస్థితి వివరించి త్వరలోనే చెల్లిస్తానని, కొంత గడువు కావాలని హన్మాను కోరాడు. అందుకు అంగీకరించని వ్యాపారి డబ్బులు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టాడు. బుధవారం బాధితుడి ఇంటికి వెళ్లి డబ్బుల కోసం ఒత్తిడి చేశాడు.

త్వరలోనే తీర్చేస్తానని చెప్పినప్పటికీ వినిపించుకోని హన్మా.. బాధితుడుడిపై దాడికి దిగాడు. గమనించిన అతడి భార్య అడ్డుకునేందుకు ప్రయత్నించగా, ఆమెపైనా దాడికి దిగాడు. అక్కడితో ఆగక ఆమెను ఇంట్లోంచి బయటకు లాక్కొచ్చి ఆమెపైనా దాడిచేశాడు. అనంతరం బాధితురాలిని తన ఇంటికి లాక్కెళ్లి నిర్బంధించాడు. దీంతో బాధితుడు నేరుగా టేకులపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి  ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News