Corona Virus: ఇండియాలోని 'హాట్ స్పాట్' ప్రాంతాల జాబితాను విడుదల చేసిన కేంద్రం!

  • మొత్తం 170 ప్రమాదకర ప్రాంతాల గుర్తింపు
  • జాబితాలో అన్ని మహా నగరాల పేర్లు
  • కంటైన్ మెంట్ జోన్లలో మరిన్ని నిబంధనలు
  • 28 రోజుల పాటు కొత్త కేసు రాకుంటేనే గ్రీన్ జోన్ లోకి
Central Government Releases List of Hot Zones

ఇండియాలో కరోనా కేసులు అధికంగా నమోదైన హాట్ స్పాట్ లను కేంద్రం ప్రకటించింది. మొత్తం 170 అత్యంత ప్రమాదకర ప్రాంతాలను గుర్తించగా, ఈ జాబితాలో దేశంలోని అన్ని మహానగరాలు, ఇతర పెద్ద నగరాలు ఉండటం గమనార్హం. దేశ రాజధాని ఢిల్లీ పరిధిలోని మొత్తం 9 జిల్లాలు, ముంబయి, కోల్ కతా, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై మెట్రో సిటీస్ తో పాటు జైపూర్, ఆగ్రా వంటి నగరాల పేర్లూ ఉన్నాయి.

ఓ రాష్ట్రంలో నమోదైన కేసుల్లో అత్యధికం నమోదైన ప్రాంతాలను హాట్ స్పాట్ లేదా రెడ్ జోన్ లుగా అభివర్ణించిన కేంద్రం, ఇక్కడ కరోనా ఇన్ ఫెక్షన్ రేటు ఎక్కువగా ఉంటుందని, ప్రతి నాలుగు రోజులకూ ఒకసారి ఇన్ ఫెక్షన్ రేటు రెట్టింపు అవుతూ ఉంటుందని వెల్లడించింది. ఆయా రాష్ట్రాల పరిధిలో మెట్రో నగరాల్లోనే అత్యధిక కేసులు ఉన్నాయని పేర్కొంది. మహారాష్ట్రలో 2,916 కేసులు రాగా, ముంబైలోనే 1,896 కేసులు ఉన్నాయి. ఢిల్లీలో 1,561 కేసులు ఉన్నాయి. వీరిలో 30 మంది మరణించగా, మరో 30 మంది చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. ఢిల్లీలోని 56 ప్రాంతాలను కంటైన్ మెంట్ జోన్ లుగా గుర్తించి, మరిన్ని కఠిన నిబంధనలను అమలు చేస్తున్నారు.

ఈ 170 హాట్ స్పాట్ కేంద్రాల్లో 47 సామూహిక వైరస్ వ్యాప్తి ప్రాంతాలను గుర్తించామని ప్రభుత్వం పేర్కొంది. ఓ ప్రాంతంలో 15 కన్నా అధిక కేసులు నమోదైతే, అక్కడ సామూహిక వ్యాప్తి ఉన్నట్టని వెల్లడించింది. ఇక, వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గని ప్రాంతాలు కూడా ఈ జాబితాలోకే వస్తాయని వెల్లడించింది. వైరస్ వ్యాప్తి తగ్గాలంటే, రెడ్, ఆరంజ్ జోన్లపై మరింత శ్రద్ధ పెట్టాలని, వీటి చుట్టుపక్కలా ఉండే బఫర్ జోన్ లపై దృష్టిని సారించాలని రాష్ట్రాల ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది.

ఇక హాట్ స్పాట్ కేంద్రాల్లో కనీసం 28 రోజుల పాటు ఒక్క కేసు కూడా రాకుండా ఉండి, ఆ ప్రాంతంలోని రోగులంతా చికిత్స పొంది డిశ్చార్జ్ అయితే, ఆ ప్రాంతాన్ని గ్రీన్ జోన్ కింద పరిగణించవచ్చని సూచించింది. రెడ్ జోన్లలో ప్రత్యేక వైద్య సిబ్బందితో ఇంటింటి పరీక్షలు నిర్వహించాలని, ఇక్కడి ప్రజలకు కేవలం కరోనా పరీక్షలే కాకుండా, ఫ్లూ సంబంధిత పరీక్షలు కూడా జరిపించాలని ఆదేశించింది.

More Telugu News