Ultraviolet Torch: కరోనా వైరస్ ను చంపేసే టార్చ్ లైట్... తయారు చేసిన భారత ప్రొఫెసర్!

Maha Professor Develops torch to Disinfect Food from Corona
  • శివాజీ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ రాజేంద్ర ఆవిష్కరణ
  • విడుదల చేసిన మహారాష్ట్ర మంత్రి ఉదయ్ సామంత్
  • ధర రూ. 4,500 నుంచి రూ. 5,500 మధ్య
  • మరో వారంలో అందుబాటులోకి
నిత్యావసరాలపై నిలిచివుండే కరోనా సహా, అన్ని రకాల సూక్ష్మ క్రిములను అంతమొందించే అల్ట్రా వయొలెట్ టార్చ్ ని మహారాష్ట్రలోని శివాజీ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ రాజేంద్ర సొంకవాడే కనిపెట్టారు. ఈ పోర్టబుల్ టార్చ్ ని రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ మంత్రి ఉదయ్‌ సామంత్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజేంద్ర చెబుతూ, మరో వారం రోజుల్లో దీనిని మార్కెట్‌ లోకి ప్రవేశపెడతామని వెల్లడించారు.

ఈ టార్చ్ వెలుగును ప్రసరింపజేయడం ద్వారా ఆహార పదార్థాలు, పాల ప్యాకెట్లు, కూరగాయలు, కరెన్సీ నోట్లు తదితరాలపై తిష్టవేసే సూక్ష్మ క్రిములను అంతం చేయవచ్చని, కొన్ని నిమిషాల పాటు కాంతిని చూపితే, కరోనా వైరస్ చచ్చిపోతుందని రాజేంద్ర తెలియజేశారు. 16 వాట్‌ పవర్‌, 33 వాట్ పవర్ ఉండే, రెండు వేరియంట్లలో లైట్స్ తయారు చేశామని, వీటి ఖరీదు వరుసగా రూ. 4,500, రూ. 5,500 ఉంటుందని తెలిపారు.

ఈ పరికరాన్ని తన కుమారుడు అంకిత్, కుమార్తె పూనమ్ ల సాయంతో తయారు చేసినట్టు ఆయన తెలిపారు. టార్చ్ లైట్ల తయారీ పెద్దఎత్తున జరిగితే, ఈ ధర మరింతగా తగ్గే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. వైరస్ ఉందని భావించిన వస్తువులు, పదార్థాలపై ఈ టార్చ్ వెలుగు ప్రసరించేలా కొన్ని నిమిషాల పాటు ఉంచితే వైరస్ లు నశిస్తాయని తెలిపారు.

ముంబయికి చెందిన గృహోపకరణాల కంపెనీ ప్లా ఎలక్ట్రో అప్లయెన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా వీటిని పెద్దమొత్తంలో తయారు చేస్తున్నామని, కార్నెల్‌ వర్సిటీ పరిశోధకుల అధ్యయనం ఫలితాలను ఆదర్శంగా తీసుకుని, ఈ టార్చ్ లైట్ ను రూపొందించినట్టు ఆయన పేర్కొన్నారు. నిర్దేశిత ప్రమాణాల్లోనే ఇది అతి నీలలోహిత కిరణాలను విడుదల చేస్తుంది కాబట్టి, దీని వల్ల మానవులకు ఎలాంటి హానీ జరుగదని, ఆహార పదార్థాలు చెడిపోవని స్పష్టం చేశారు. ఇదే లైట్ ను పెద్ద పరిమాణంలో తయారుచేసి ఆసుపత్రులు, సూపర్‌ మార్కెట్లు, రవాణా సాధనాల్లో కరోనా సంహారిణిగా వాడుకోవచ్చని తెలియజేశారు.
Ultraviolet Torch
Corona Virus
Light
Sivaji University

More Telugu News