ICC womens world cup: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించిన భారత్

India qualify for ICC Womens ODI World Cup 2021
  • భారత్-పాక్ మధ్య జరగాల్సిన వామప్ సిరీస్ రద్దు
  • ఇరు జట్లకు మూడేసి పాయింట్లు పంచిన ఐసీసీ
  • 23 పాయింట్లు ఉన్న భారత్‌కు నేరుగా ప్రవేశం
వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌కు భారత జట్టు నేరుగా అర్హత సాధించింది. పాకిస్థాన్‌తో జరగాల్సిన వామప్ సిరీస్ రద్దు కావడంతో ఐసీసీ టెక్నికల్ కమిటీ ఇరు దేశాలకు సమాన పాయింట్లు ఇచ్చింది. ఫలితంగా భారత పాయింట్ల సంఖ్య 23కు పెరగ్గా, పాకిస్థాన్ ఖాతాలో 19 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. పాక్ కంటే ఎక్కువ పాయింట్లు ఉన్న భారత్‌కు నేరుగా ప్రవేశం లభించింది. భారత్-పాక్ జట్ల మధ్య వామప్ సిరీస్ నిర్వహించాలని ఇరు దేశాల బోర్డులు ప్రయత్నించినప్పటికీ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల కారణంగా సాధ్యం కాలేదని ఐసీసీ పేర్కొంది.

ఐసీసీ మహిళల చాంపియన్‌షిప్‌లో భారత్‌కు 20, పాకిస్థాన్‌కు 16 పాయింట్లు ఉన్నాయి. ఇప్పుడు వామప్ సిరీస్ రద్దు కావడంతో ఇరు జట్లకు ఐసీసీ చెరో మూడు పాయింట్లు పంచింది. దీంతో భారత్‌ పాయింట్ల సంఖ్య 23కు పెరగ్గా, పాక్ పాయింట్లు 19కి పెరిగాయి. పాయింట్లలో భారత్ కంటే వెనకున్న పాక్ ప్రపంచకప్‌కు అర్హత సాధించలేకపోయింది.

మరోవైపు, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, శ్రీలంక, న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన మ్యాచ్‌లు కూడా రద్దు కావడంతో ఆ జట్లకు కూడా ఐసీసీ సమాన పాయింట్లను పంచింది. ప్రపంచకప్‌కు అర్హత సాధించలేకపోయిన పాకిస్థాన్, శ్రీలంక మధ్య జులై 3-9 మధ్య సిరీస్ నిర్వహించనున్నట్టు ఐసీసీ తెలిపింది.
ICC womens world cup
Team India
Pakistan

More Telugu News