America: ట్రంప్ నిర్ణయాన్ని తప్పుబట్టిన ప్రపంచ దేశాలు.. ఎవరెవరు ఏమన్నారంటే?

  • ట్రంప్ కోపం అమెరికన్లనూ దెబ్బతీస్తుందన్న చైనా
  • సమష్టిగా పోరాడాల్సిన తరుణంలో ఇలాంటి నిర్ణయాలు తగవన్న జర్మనీ
  • తీవ్ర విచారకరమన్న ఆఫ్రికా కూటమి
World Countries fires on Trump Decision

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)కు నిధులు నిలిపివేస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని పలు దేశాలు తప్పుబట్టాయి. ప్రస్తుత తరుణంలో భేషజాలు మాని ఐకమత్యంతో పనిచేయాల్సిన చోట ఇలాంటి నిర్ణయాలు సరికాదని హితవు పలికాయి. దేశం ఏదైనా సంక్షోభాలను నివారించడంలో ముందుండే ‘డబ్ల్యూహెచ్ఓ’ను తక్కువ చేసి చూడడం తగదని చైనా పేర్కొంది. ఆ సంస్థకు నిధులు నిలిపివేస్తే ఆ ప్రభావం అమెరికా సహా, వ్యవస్థలు సరిగా లేని అన్ని దేశాలపైనా ఉంటుందని పేర్కొంది. ట్రంప్ కోపం అమెరికన్లను కూడా దెబ్బతీసుందని హెచ్చరించింది.

పరీక్షలు చేయడానికి, వ్యాక్సిన్లను అభివృద్ధి చేయడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ వద్ద తగినన్ని నిధులు లేవని, సమష్టిగా పోరాడాల్సిన తరుణంలో ఇలాంటి నిర్ణయాలు తగవని జర్మనీ పేర్కొంది. వైరస్‌కు ఎలాంటి సరిహద్దులు లేవని, ఐక్యరాజ్య సమితిని పటిష్టంగా మార్చడమే ఇప్పుడు అత్యుత్తమ పెట్టుబడి అని అభిప్రాయపడింది.

‘డబ్ల్యూహెచ్ఓ'కు ట్రంప్ నిధులు నిలిపివేయడానికి సరైన కారణాలు లేవని 27 దేశాల ఐరోపా కూటమి పేర్కొంది. అందరూ ఏకతాటిపైకి వస్తేనే ఈ మహమ్మారిపై విజయం సాధించగలుతామంది. ట్రంప్ తీవ్ర విమర్శలకు గురైన చైనా, ప్రపంచ ఆరోగ్య సంస్థపై ఆస్ట్రేలియా సానుభూతి వ్యక్తం చేసింది. మునుపటి కన్నా ఇప్పుడే ‘డబ్ల్యూహెచ్ఓ’కు ఎక్కువ నిధులు అవసరమని, ఇలాంటి సమయంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడం బాధాకరమని పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థకు నిధులు ఆపివేయడం తీవ్ర విచారకరమని ఆఫ్రికా కూటమి పేర్కొంది.

More Telugu News