Lockdown: 20 తర్వాత పరిమితంగానే అనుమతులు.. లాక్‌డౌన్‌ మార్గదర్శకాలు ఇవీ!

  • కొన్ని రంగాలకు ప్రత్యేక పర్మిషన్లు
  • అత్యవసర వైద్య సేవలకే రాష్ట్రం దాటేందుకు అనుమతి
  • ఆక్వా ఉత్పత్తుల క్రయవిక్రయాలకు ఓకే
Lockdwon guidelines released

లాక్‌డౌన్‌ వేళ ఈ నెల 20 తర్వాత కొంత సడలింపు ఇచ్చినా పరిమిత అనుమతులు మాత్రమే ఉంటాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. నిన్నటితో ముగిసిన లాక్‌డౌన్‌ను మే 3వ తేదీ వరకు పొడిగిస్తూ ప్రధాని మోదీ జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అదే సమయంలో 20వ తేదీ తర్వాత పరిస్థితిని బట్టి కొన్ని పరిమిత సడలింపులు ఉంటాయని స్పష్టం చేశారు. కానీ హాట్‌స్పాట్‌  ప్రాంతాల్లో ఎటువంటి మినహాయింపులు ఉండవని స్పష్టం చేసింది. అయితే నిత్యావసరాలు ఇళ్ల వద్దకు వెళ్లే ఏర్పాటు చేస్తారు. హాట్‌స్పాట్‌ జోన్లు ఏవో  రాష్ట్ర, జిల్లా యంత్రాంగాలు ప్రకటించాలి. ఆ ప్రాంతాల్లో సాధారణ మినహాయింపులు వర్తించవు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం ఈ రోజు విడుదల చేసింది. అవేంటంటే...

  • వైద్య సేవలకు తప్ప మిగిలిన ఏ అవసరం కోసం సరిహద్దును దాటేందుకు ఎవరినీ అనుమతించరు.
  • ఆరోగ్య, ఔషధ కేంద్రాలు, దుకాణాలు తెరిచి ఉంటాయి.
  • వివాహాలు, శుభకార్యక్రమాలకు కలెక్టర్ అనుమతి తప్పనిసరి. సందర్భం బట్టి సంఖ్యకు అనుమతి ఇస్తారు.
  • కుటుంబ సభ్యులు ఎవరైనా మరణిస్తే అంత్యక్రియలకు 20 మంది వరకు అనుమతిస్తారు
  • ఉపాధి హామీ పనులకు కూలీలను అనుమతించనున్నారు. భౌతిక దూరం పాటిస్తూ పనులు చేయాల్సి ఉంటుంది.
  • వ్యవసాయ పనులకైనా ఇతర ప్రాంతాల నుంచి కూలీల తరలింపునకు అనుమతించరు.
  • ఆక్వా ఉత్పత్తుల క్రయవిక్రయాలకు అనుమతిస్తారు.
  • భవన నిర్మాణాలకు షరతులతో అనుమతిస్తారు.
  • బ్యాంకుల కార్యకలాపాలు ఇప్పటిలాగే యథావిధిగా కొనసాగుతాయి.
  • పాలు, పాల ఉత్పత్తులు, టీ, కాఫీ, రబ్బరు సాగు పనులు, ఫౌల్ట్రీ కొనసాగించవచ్చు.
  • అనాథాశ్రమాలు, దివ్యాంగుల కేంద్రాలకు అనుమతి.
  • ఈకామర్స్ కార్యకలాపాలు, వాహనాలకు అనుమతి
  • ఎలక్ట్రిషియన్, ఐటీ మరమ్మతులు, మోటారు మెకానిక్ లు, కార్పెంటర్లకు అనుమతి.
  • ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, డీటీహెచ్, కేబుల్ సర్వీసులు యథాతథం.
  • ఐటీ సంస్థలు యాభై శాతం సిబ్బందితో కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు అనుమతి.
  • రోడ్డు పక్కన దాబాలు, వాహన మరమ్మతుల దుకాణాలకు అనుమతి
  • విద్య, శిక్షణ సంస్థలు మూసివేయాలి. మతపరమైన కార్యక్రమాలు నిషేధం.
  • బార్లు, షాపింగ్ మాళ్లు, థియేటర్లు, జిమ్, స్పోర్ట్స్ క్లబ్, ఈత కొలనులపై నిషేధం యథాతథం.
  • వ్యవసాయ పరికరాలు, విడిభాగాల దుకాణాలు తెరవొచ్చు. వ్యవసాయ పరికరాలు అద్దెకు ఇవ్వొచ్చు.
  • ఎరువులు, పురుగుల మందుల దుకాణాలు, విత్తనోత్పత్తి కేంద్రాలు తెరవవచ్చు.
  • గోదాములు, శీతల గోదాములకు అనుమతి.
  • గ్రామీణ ప్రాంతాల్లో సాగునీటి పనులు, రోడ్ల నిర్మాణం చేపట్టవచ్చు. పారిశ్రామిక ప్రాజెక్టుల పనులు చేపట్టవచ్చు.
  • మాస్క్ లు ధరించడం తప్పనిసరి. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మితే జరిమానా వేస్తారు.

More Telugu News