Krishna District: విషాదం వేళ సైతం.. విధులలో కృష్ణా జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్!

  • కరోనా విధుల్లో నిమగ్నమై ఉన్న జిల్లా అధికారి
  • ఆ సమయంలో మామ చనిపోయినట్లు సమాచారం
  • బాధను దిగమింగుకుని బాధ్యతల్లో మునిగిపోయిన వైనం
Hatsoff to krishna district collector

వ్యక్తిగత అవసరాల కంటే ప్రజావసరాలకు తొలి ప్రాధాన్యం ఇస్తానన్న శిక్షణ నాటి ప్రమాణాన్ని అక్షరాలా పాటించారు కృష్ణా జిల్లా కలెక్టర్‌ ఎ.ఎం.డి.ఇంతియాజ్‌. కుటుంబ పరంగా విషాదం ఎదురైనా తన వృత్తి ధర్మానికే కట్టుబడి బాధ్యతగల అధికారినని నిరూపించారు. వివరాల్లోకి వెళితే...ప్రస్తుతం రాష్ట్రం కరోనా విపత్తును ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. జిల్లా కలెక్టర్‌గా నిద్రాహారాలు మాని వైరస్‌ కట్టడి చర్యలు, ముందుజాగ్రత్త చర్యల్లో జిల్లా అధికారులు నిమగ్నమై ఉన్నారు.

విధుల్లో ఉన్న వారికి మార్గదర్శకత్వం వహిస్తూ బిజీగా ఉన్న సమయంలో కలెక్టర్‌కు ఓ విషాదకర వార్త అందింది. ఆయన మామగారైన (భార్య తండ్రి) డాక్టర్‌ ఇస్మాయిల్‌ హుస్సేన్‌ చనిపోయినట్టు తెలియడంతో ఓ క్షణం షాకయ్యారు. ఇస్మాయిల్‌ నిన్న కర్నూలులోని ఓ ఆసుపత్రిలో గుండె సంబంధిత వ్యాధితో చనిపోయారు.

విషాద సమయమే అయినా కరోనా నియంత్రణలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో కలెక్టర్‌ విధులకే ఆయన ప్రాధాన్యం ఇచ్చారు. కర్నూలు వెళ్లకుండా నిన్న నిర్వహించిన సమీక్ష, సమావేశాల్లో ఎప్పటిలాగే ఇంతియాజ్ పాల్గొన్నారు.

More Telugu News