మోదీ ప్లాన్ వేరే ఉంది... అదేంటో రేపు తెలుస్తుంది: కేంద్ర మంత్రి జవదేకర్ కీలక వ్యాఖ్య

14-04-2020 Tue 16:34
  • లాక్ డౌన్ పొడిగింపు ఓ గేమ్ చేంజర్
  • ఇప్పటికే సిద్ధమైన కరోనా ప్లాన్
  • ప్రజలు సహకరించాలన్న జవదేకర్
Narendra Modi Plan on Corona Will Reveal Tomorrow

కరోనాపై భారతావని చేస్తున్న పోరాటంలో లాక్ డౌన్ ను పొడిగించాలన్న ఆలోచన కేవలం ఓ గేమ్ చేంజర్ అని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ వ్యాఖ్యానించారు. కరోనాపై పోరులో ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే ఓ ప్రణాళికను సిద్ధం చేశారని, దీనిపై రేపు ఓ కీలక ప్రకటన వెలువడనుందని తెలిపారు.

మార్చి 24 అర్థరాత్రి నుంచి లాక్ డౌన్ విధించిన విషయాన్ని గుర్తు చేసిన ఆయన, కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ప్రజలు సానుకూలంగా స్పందించారని, వచ్చే 19 రోజులూ అదే విధమైన సహకారాన్ని అందిస్తారని ఆశిస్తున్నామని అన్నారు. ఏప్రిల్ 20 తరువాత రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించాల్సిన లాక్ డౌన్ వ్యూహంపైనా కేంద్రం నుంచి సలహాలు, సూచనలు అందుతాయని, ఆపై రాష్ట్రాల్లోని పరిస్థితులకు అనుగుణంగా, ఆయా ప్రాంతాల్లోని సౌలభ్యాల ప్రకారం నిర్ణయాలు తీసుకోవచ్చని జవదేకర్ సూచించారు.

ఎన్నో ప్రపంచ దేశాలు కరోనా కోరల్లో చిక్కుకుని, విజయం సాధించలేక అల్లాడుతున్నాయని, దేశ ప్రజలంతా విధిగా అన్ని నిబంధనలూ పాటిస్తే, కరోనాపై యుద్ధంలో తప్పక గెలిచితీరుతామని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్రానికి ప్రజల మద్దతు తప్పనిసరని అభిప్రాయపడ్డ జవదేకర్, ఈ మహమ్మారికి విరుగుడును శాస్త్రవేత్తలు త్వరగా కనిపెట్టాలని కోరారు. ప్రధాని నేడు చేసిన ప్రసంగం, ఆయనలోని నాయకుడిని, జాతి ప్రజల పట్ల ఉన్న అంకితభావాన్ని ప్రతిబింబించిందని అన్నారు.