Harpoon: భారత్ కు శత్రుభీకర మిస్సైళ్లు, టార్పెడోలు విక్రయించేందుకు అమెరికా ఆమోదం

US approves to give Harpoon missiles and MK torpedos
షార్ట్స్‌లో చూడండి
కరోనా రక్కసి కరాళ నృత్యం చేస్తున్న తరుణంలో 35 లక్షల హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలను పంపిన భారత్ పట్ల అమెరికా కృతజ్ఞత ప్రదర్శిస్తోంది. ప్రత్యర్థి రక్షణ వ్యవస్థలను తుత్తునియలు చేసే హర్పూన్ బ్లాక్-2 ఎయిర్ లాంచ్డ్ క్షిపణులతో పాటు ఎంకే-54 టార్పెడోలను విక్రయించేందుకు అంగీకారం తెలిపింది.

ఈ వ్యాపార ఒప్పందం విలువ 155 మిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. 10 ఏజీఎం-84ఎల్ హర్పూన్ బ్లాక్-2 మిసైళ్ల విలువ 92 మిలియన్ డాలర్లు కాగా, 16 ఎంకే-54 ఆల్ రౌండప్ లైట్ వెయిట్ టార్పెడోలు, 3 ఎంకే-54 ఎక్సర్ సైజ్ టార్పెడోల విలువ 63 మిలియన్ డాలర్లు ఉంటుందని అమెరికా రక్షణ శాఖ తమ జాతీయ చట్టసభలకు వెల్లడించింది.

ఇటీవలే ఈ రెండు ఆయుధాలను అందించాలని భారత ప్రభుత్వం విజ్ఞప్తి చేయగా, అమెరికా రక్షణ శాఖ ఆ ప్రతిపాదనను పరిశీలనలో ఉంచింది. అమెరికాలో కరోనా అత్యంత తీవ్రస్థాయిలో విజృంభిస్తుండడంతో వాణిజ్య ఆంక్షలు సడలించి మరీ భారత్ పెద్దఎత్తున హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలను ఎగుమతి చేసింది. ఈ నేపథ్యంలో, భారత్ చేసిన సాయాన్ని దృష్టిలో ఉంచుకున్న అమెరికా అధినాయకత్వం ఆగమేఘాలపై రక్షణ ఒప్పందాన్ని పట్టాలెక్కించినట్టు తెలుస్తోంది.

భారత్ కోరిన ఆయుధాల విషయానికొస్తే.... హర్పూన్ మిసైళ్లను నావికాదళానికి చెందిన పి-81 విమానానికి అమర్చుతారు. ఇవి నావికా దళ సామర్థ్యాన్ని మరింత ఇనుమడింప చేస్తాయి. ఇక, ఎంకే-54 టార్పెడోల విషయానికొస్తే ఇవి జలాంతర్గాములను వెతికి మరీ వేటాడతాయి. ఇవి తక్కువ బరువు ఉండడంతో అత్యంత వేగంతో ప్రయాణించి కొద్ది సమయంలోనే లక్ష్యాన్ని తాకుతాయి.
Go Back to Shorts
Harpoon
MK-54
Torpedo
India
USA
Corona Virus
Hydroxychloroquine

More Telugu News