Corona Virus: కరోనా రోగులు, అనుమానితులపై ‘స్మార్ట్’గా నిఘా.. కాలు కదిపినా దొరికిపోతారు!

Smart smart surveillance of corona patients and suspects
  • వాళ్ల  మొబైల్స్‌లో ప్రత్యేక యాప్‌
  • ఎక్కడికి వెళ్లినా పసిగట్టే టెక్నాలజీ
  • తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడి
కరోనా వైరస్‌ కట్టడికి తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. వైరస్ సోకిన వారికి ప్రభుత్వమే మెరుగైన చికిత్స అందిస్తోంది. వైరస్ అనుమానితులను తమ ఇళ్లు, క్వారంటైన్ సెంటర్లలో ఉంచి పర్యవేక్షిస్తోంది. కానీ, కొంత మంది రోగులు, అనుమానితులు.. వైద్యులు, అధికారులకు అస్సలు సహకరించడం లేదు. ఆసుపత్రుల్లో కొందరు వైద్య సిబ్బందిపైనే దాడులకు పాల్పడిన ఘటనలు జరిగాయి. మరికొందరు ఆసుపత్రులతో పాటు క్వారంటైన్ సెంటర్ల నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో కరోనా రోగులపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ నిఘా పెంచింది. టెక్నాలజీ సాయంతో హాస్పిటల్‌లో వాళ్ల ప్రతి కదలికనూ గుర్తిస్తోంది.

అడుగు వేస్తే తెలిసిపోతుంది

 వైరస్ బారిన పడిన వ్యక్తుల ఫోన్లలో ప్రత్యేకంగా రూపొందించిన మానిటరింగ్ యాప్‌ ను అధికారులు ఇన్‌స్టాల్ చేస్తున్నారు. ఇప్పటికే 30 శాతం మంది బాధితుల ఫోన్లలో యాప్ ఇన్‌స్టలేషన్ ప్రక్రియ పూర్తయిందని చెప్పారు. రోగి పేరు, ఐడీ, బెడ్ నంబర్‌‌, వార్డు నంబర్ అన్నీ అందులో అప్‌లోడ్ చేస్తారు. బెడ్ ఉన్న వార్డు లొకేషన్‌ను కూడా ట్యాగ్‌ చేస్తారు.

దాంతో రోగులు తమకు కేటాయించిన వార్డు దాటి బయటకు వెళ్తే అలర్ట్‌  వస్తుంది. ఫోన్ కదిలే ప్రతి మీటర్‌‌నూ ఈ యాప్‌ లెక్కిస్తుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినా కూడా వెంటనే సంబంధిత హాస్పిటల్ సూపరింటెండెంట్‌కు, పోలీస్ అధికారులకు అలర్ట్ వెళ్తుంది. తద్వారా వైద్యులు, అధికారులు తగిన చర్యలు తీసుకుంటారు.

క్వారంటైన్‌లో ఉన్న వాళ్ల ఫోన్లలోనూ

మర్కజ్‌కు వెళ్లివచ్చి హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్న వాళ్లు, వారితో కాంటాక్టు అయి ఇళ్ల వద్ద క్వారంటైన్‌లో ఉన్నవారందరి ఫోన్లలో ఈ యాప్‌ ఇదివరకే ఇన్‌స్టాల్ చేశారు. దీంతో ఇళ్ల నుంచి బయటకు వెళ్లిన వాళ్లను, ఇతర ప్రాంతాలకు పారిపోయేందుకు ప్రయత్నించిన వాళ్లను గుర్తించామని అధికారులు తెలిపారు. ఇప్పటికే  సుమారు 5 వేలసార్లు అలర్ట్‌లు వచ్చాయని చెప్పారు. వారిలో కొంతమందిపై చర్యలు కూడా తీసుకున్నామన్నారు.  సీఎం ఆఫీస్ నుంచి కింది స్థాయి ఏఎన్‌ఎం వరకు ఈ యాప్‌ను వినియోగిస్తున్నారు.
Corona Virus
Telangana
patients
suspects
smart phone
app
surveillance

More Telugu News