Imran Khan: అమెరికా కన్నా అధ్వానం కాబోతున్న పాకిస్థాన్: బిలావల్ భుట్టో హెచ్చరిక

  • ఇమ్రాన్ ఖాన్ కు పరిస్థితి అర్థం కావడం లేదు
  • ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టుకోవచ్చుగానీ, ప్రాణాలను తేలేం
  • భారత నిపుణులు ఇమ్రాన్ కు హితబోధ చేయాలన్న బిలావల్
Bilawal Butto Warns Pak will be More Trouble than us

ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నా, తిరిగి గాడిలో పడేట్టు చేయవచ్చుగానీ, ప్రజల ప్రాణాలు పోతే తీసుకురాలేమని, ఈ విషయంలో ఇమ్రాన్ ఖాన్ వైఖరితో, పాకిస్థాన్ పరిస్థితి అమెరికా కన్నా అధ్వానంగా మారనుందన్న భయం నెలకొందని ఆ దేశ మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో కుమారుడు, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ అధినేత బిలావల్ భుట్టో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయం ఇమ్రాన్ సర్కారుకు అర్థమయ్యేలా చెప్పేందుకు భారత వైద్యాధికారులు హితబోధ చేయాలని కోరారు.

తాజాగా వీడియో కాల్ ద్వారా మీడియాతో మాట్లాడిన ఆయన, అంతా బాగుందని ఆశించడం మంచిదే అయినా, విపత్కర పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, కానీ, పాకిస్థాన్ ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదని ఆరోపించారు. దేశం నెమ్మదిగా విపత్తులోకి జారిపోతోందని హెచ్చరించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కోట్లాది మంది ప్రజల ప్రాణాలకు ప్రమాదాన్ని పెంచిందని, తక్షణమే స్పందించకుంటే, యూఎస్, యూరప్ కన్నా పాక్ లో పరిస్థితి దిగజారుతుందని అన్నారు.

దేశంలోని వైద్య సిబ్బందికి కనీస రక్షణ పరికరాలు లేవని, ఆసుపత్రుల్లో ఉన్న బెడ్స్ అంతంతమాత్రమేనని గుర్తు చేశారు. కాగా, పాకిస్థాన్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5 వేలను దాటగా, సుమారు 100 మంది మరణించారు. దేశవ్యాప్త లాక్ డౌన్ ను అమలు చేస్తే, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని ఇటీవల ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

More Telugu News