Corona Virus: కరోనా సోకిందని కుటుంబానికి వేధింపులు.. సామాజిక బహిష్కరణ!

  • మధ్యప్రదేశ్‌లోని శివపురిలో ఘటన
  • పాలు, కూరగాయలు కూడా దొరకని వైనం
  • ఇల్లు అమ్మేసి వేరే ప్రాంతానికి వెళ్లాలనుకుంటున్న కుటుంబం
  • దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
Recovered COVID19 patient alleges harassment at hands of neighbours in

కరోనాను ధైర్యంగా ఎదుర్కొని జయించాడు ఆ వ్యక్తి.. ఆసుపత్రి నుంచి తిరిగి ఇంటికి వచ్చాడు. కానీ, తానుంటున్న వీధిలోని వారు అంటోన్న మాటలను భరించలేకపోతున్నాడు. తమ కుటుంబాన్ని వీధిలోని వారంతా సామాజికంగా బహిష్కరించడంతో తన ఇల్లు అమ్మేసి వేరే ప్రాంతానికి వెళ్లిపోవాలనుకుంటున్నాడు.

మధ్యప్రదేశ్‌లోని శివపురికి చెందిన ఓ వ్యక్తి (34) పట్ల వీధిలోని వారంతా వివక్ష కనబర్చుతున్నారు. అతడి ఇంటి వద్దకు పాలు, కూరగాయలు అమ్మే వ్యక్తులు కూడా రావట్లేదు. కుటుంబాన్ని వీధిలో ఉన్న వారంతా దూషిస్తున్నారని అతడు చెప్పాడు.
 
'నేను తొమ్మిదేళ్లుగా వేరే ప్రాంతంలో పని చేసుకుంటున్నాను. కరోనా విజృంభణ నేపథ్యంలో మార్చి 18న ఇంటికి వచ్చాను. బాధ్యతగా ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నాను. నాకు కరోనా సోకిందని నిర్ధారించారు. చికిత్స అనంతరం కరోనా నుంచి కోలుకుని తిరిగి ఇంటికి వచ్చాను' అని బాధితుడు దీపక్ శర్మ మీడియాకు తెలిపాడు.

'మా కుటుంబ సభ్యులకు కూడా పరీక్షలు చేసి, నెగిటివ్‌ అని తేల్చారు. కానీ, స్థానికులు మా ఇంట్లోని వారిని దూషిస్తున్నారు. దీంతో పోలీసులకు ఈ విషయం చెప్పాను. అయినప్పటికీ స్థానికుల తీరు మారలేదు. దీంతో నేను మా ఇంటిని అమ్మేయాలని నిర్ణయించుకున్నాను' అని చెప్పాడు.

నిత్యావసర సరుకులు కూడా కొని తెచ్చుకునేందుకు స్థానికులు సహకరించట్లేదని తెలిపాడు. దీనిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ కుటుంబానికి ప్రస్తుతం పోలీసులు సాయం చేస్తున్నారు. అయితే, క్వారంటైన్‌లో వారు ఉన్న సమయంలో రోడ్లపై తిరిగారని, దీంతో స్థానికులు వారితో గొడవ పెట్టుకున్నట్లు కూడా తెలిసిందని పోలీసులు చెప్పారు. మధ్య ప్రదేశ్‌లో 604 మందికి కరోనా సోకింది. 43 మంది ప్రాణాలు కోల్పోయారు.

More Telugu News