Narendra Modi: తొలుత 21 రోజులు... ఇప్పుడు 19 రోజుల లాక్ డౌన్... మోదీ ప్రయోగించిన 'భారతీయత' సెంటిమెంట్ అస్త్రం!

  • మొత్తం లాక్ డౌన్ కాల పరిమితి 40 రోజులు
  • 40 రోజులంటే ఒక 'మండలం'
  • మండల దీక్షపై భారతీయుల్లో ఎంతో సెంటిమెంట్
  • దాన్నే ప్రయోగించిన నరేంద్ర మోదీ
Narendra Modi Mandal Deeksha on Lockdown

గత నెలలో భారత ప్రజలంతా కరోనాపై పోరాడేందుకు 21 రోజుల పాటు లాక్ డౌన్ పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. కొన్ని ప్రాంతాల్లో మినహా చాలా చోట్ల ప్రజలు మోదీ మాటలను తు.చ. తప్పకుండా పాటించిన కారణంగానే, కరోనాకు కాస్తంతైనా అడ్డుకట్ట పడిందనడంలో సందేహం లేదు.

అయినప్పటికీ కేసుల సంఖ్య రోజుకు 7 నుంచి 8 శాతం మేరకు పెరుగుతూ, ప్రస్తుతం 10 వేలకు పైగా నమోదయ్యాయి. రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన వేళ, లాక్ డౌన్ పొడిగించాలన్న వినతులు వచ్చాయి. దీంతో ఆయన సైతం కరోనా కట్టడికి నిబంధనల కొనసాగింపే మంచిదన్న ఉద్దేశానికి వచ్చారు.

ఇక అటు రెండు వారాలు కాకుండా, ఇటు మూడు వారాలు కాకుండా, మధ్యలో 19 రోజులు లాక్ డౌన్ కొనసాగుతుందని మోదీ ప్రకటించడం వెనుక, ఆయన చాలా పెద్ద ఆలోచనే చేశారని భావించవచ్చు. 21కి 19 కలిపితే 40 వస్తుంది. అంటే 'మండలం'... ఇండియాలో మండల దీక్షకు ఎంతో విలువ ఉంది. ప్రతియేటా కోట్లాది మంది అయ్యప్ప భక్తులు మండల దీక్ష పాటించి, యాత్ర చేస్తుంటారు. జైనులు కూడా మండల దీక్ష చేస్తుంటారు. వివిధ రాష్ట్రాల్లో భక్తి కార్యక్రమాలు మండలం రోజులు కొనసాగుతుంటాయి. ఈ నేపథ్యంలో మండలం రోజుల లాక్ డౌన్, ప్రజల్లో నిబంధనల సెంటిమెంట్ ను నిలిపివుంచుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

కరోనా కట్టడి కావాలంటే, మండల దీక్షను భారత ప్రజలతో చేయించాలన్న ఉద్దేశంతోనే, లాక్ డౌన్ పొడిగింపును 19 రోజులుగా మోదీ నిర్ణయించారని భావిస్తున్నారు. ఆ కారణంతోనే మండల దీక్ష సెంటిమెంట్ ను మోదీ ప్రయోగించారని అంటున్నారు.

More Telugu News