Lockdown: గూడ్స్ వాహనాలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!

Government says no ban on inter state movement of trucks
  • ట్రక్కులు, గూడ్స్ క్యారియర్లను ఆపొద్దని ఆదేశాలు 
  • ఎలాంటి అదనపు పర్మిట్లు అవసరం లేదు 
  • ఆ వాహనాల్లో డ్రైవర్ కాకుండా క్లీనర్ కు మాత్రమే అనుమతి
లాక్‌డౌన్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా సరుకుల రవాణాకు ఆటంకం కలుగుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే గూడ్స్ వాహనాలను కొన్ని రాష్ట్రాలు అనుమతించడం లేదు.  అలా చేయడం వల్ల దేశ వ్యాప్తంగా సరుకుల కొరత ఏర్పడుతుందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. అందువల్ల దేశ వ్యాప్తంగా గూడ్స్ వాహనాలను ఆపొద్దని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల (యూటీ) ప్రభుత్వాలను ఆదేశించింది. ఆ వాహనాలపై ఎలాంటి ఆంక్షలు విధించవద్దని సూచించింది. లాక్‌డౌన్ విషయంలో ప్రభుత్వ మార్గదర్శకాలు అనుసరించాలని  కేంద్ర హోం శాఖ కోరింది.  

ఆయా రాష్ట్రాల్లో అన్ని ట్రక్కులు, గూడ్స్ క్యారియర్లు తిరిగేందుకు అనుమతి ఇవ్వాలని హోం శాఖ సంయుక్త కార్యదర్శి  పుణ్య సలీల శ్రీవాస్తవ తెలిపారు. ట్రక్కు తీసుకెళ్తున్న ఆయా వస్తువులు అవసరమా? కాదా? అనేది చూడకుండా పర్మిషన్ ఇవ్వాలన్నారు. ఆయా రాష్ట్రాల అధికారుల నుంచి ట్రక్ డ్రైవర్లకు ఎలాంటి అదనపు పర్మిట్లు అవసరం లేదని స్పష్టం చేశారు. కార్గోలకు ప్రత్యేకంగా పర్మిట్ లేదా అనుమతి కూడా  అవసరం లేదన్నారు.

సరుకులు తీసుకెళ్లేందుకు వస్తున్న లేదా డెలివరీ చేసి తిరిగి వస్తున్న ఖాళీ ట్రక్కులు, గూడ్స్ క్యారియర్లను కూడా అనుమతించాల్సిందే అని స్పష్టం చేశారు. ప్రతి గూడ్స్ వాహనంలో డ్రైవర్ తో  పాటు మరొకరికి (క్లీనర్) మాత్రమే అనుమతి ఇవ్వాలని చెప్పారు. ‘ఎంఎస్ఎంఈ సెక్టార్ కు చెందిన వర్కర్లు, నిత్యావసర సరుకుల సరఫరా కోసం పని చేస్తున్న వారికి ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలి. వేర్ హౌజ్, కోల్డ్ స్టోరేజీలు తెరిచేందుకు అనుమతి ఇవ్వాలి. కంటైన్మెంట్ ఏరియాలు, హాట్ స్పాట్లు మినిహా అన్ని ప్రాంతాలకు ఈ మార్గనిర్దేశాలు వర్తిస్తాయి’ అని సలీల శ్రీవాస్తవ సూచించారు.
Lockdown
trucks
allowed
inter stae
central
governament
to
states

More Telugu News