Telangana: వైన్స్ షాపులు తెరవాలన్న డిమాండ్ పెరుగుతోంది!: తెలంగాణ ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస గౌడ్

Excise Minister Srinivas Goud Comments on Liquor Shops Opening in TS
  • ఇతర రాష్ట్రాల్లో విధానాన్ని పరిశీలిస్తాం
  • సమీక్షించిన తరువాత సీఎం నిర్ణయిస్తారు
  • తాటికల్లు మినహా మరే మత్తు పదార్థాలకు అనుమతిలేదన్న మంత్రి
తెలంగాణలో మద్యం షాపులను తిరిగి తెరిపించాలన్న డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోందని రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస గౌడ్ వ్యాఖ్యానించారు. ఇప్పటివరకూ ప్రకృతి సిద్ధంగా లభించే తాటికల్లుపై మినహా మిగతా అన్ని రకాల మత్తు పదార్థాలపైనా నిషేధం కొనసాగుతుందని, వైన్స్ షాపుల విషయంలో ఇతర రాష్ట్రాలు ఏ నిర్ణయం తీసుకుంటాయో పరిశీలించి, ఆపై సమీక్ష అనంతరం ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయం మేరకు షాపులు ఓపెన్ చేయాలా? వద్దా? అన్న విషయాన్ని నిర్ణయిస్తామని ఆయన తెలిపారు.

తాజాగా ఓ మీడియా సంస్థతో మాట్లాడిన ఆయన, కల్లు, మద్యం లభించక, పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్న వారి సంఖ్య పెరిగిందన్న విషయం తమ దృష్టికి వచ్చిందని, ఈ విషయంలో ప్రజల్లో అవగాహన పెంచేందుకు వైద్యాధికారులు కృషి చేస్తున్నారని తెలిపారు. మార్చి నాలుగో వారంలో ఓ దశలో రోజుకు 100కు పైగా కేసులు ఎర్రగడ్డ మానసిక వైద్యాలయానికి వచ్చాయని గుర్తు చేసిన ఆయన, ప్రస్తుతం కేసుల సంఖ్య చాలా వరకూ తగ్గిపోయిందని తెలిపారు.

మద్యం షాపులను తెరిస్తే, అక్కడ జనాలు అధికంగా గుమికూడతారని అభిప్రాయపడ్డ శ్రీనివాస గౌడ్, ఈ కారణంతోనే షాపులను తెరిచేందుకు అనుమతించలేదని, పరిస్థితి చక్కబడిందని భావిస్తే, షాపులను తెరిచేందుకు అనుమతించే అవకాశాలుంటాయని అన్నారు. కొన్ని ప్రాంతాల్లో అక్రమంగా మద్యం, నాటుసారా అమ్ముతున్నారని, వారిని గుర్తించి, అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. మద్యం షాపులకు వేసిన సీల్స్ ఎవరైనా తొలగించి, మద్యాన్ని అక్రమంగా రవాణా చేస్తే, వారి లైసెన్స్ లను శాశ్వతంగా రద్దు చేస్తామని హెచ్చరించారు.
Telangana
Wines
V Srinivas Goud
Opening
Liquor Policy

More Telugu News