PM Cares Fund: పీఎం కేర్స్ ఫండ్ కు వ్యతిరేకంగా దాఖలైన వ్యాజ్యాన్ని తిరస్కరించిన సుప్రీం కోర్టు

  • కరోనా నిధుల కోసం పీఎం కేర్స్ ఫండ్ ఏర్పాటు
  • దీనిపై సుప్రీంను ఆశ్రయించిన న్యాయవాది ఎంఎల్ శర్మ
  • పిటిషనర్ తప్పుగా అర్థం చేసుకున్నారన్న సుప్రీం కోర్టు
Suprem Court rejects petition against

కరోనా కట్టడి చర్యలు, సహాయక కార్యక్రమాలకు నిధులు సేకరించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలే పీఎం కేర్స్ ఫండ్ ను ప్రారంభించారు. అయితే దీన్ని వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టులో ఎంఎల్ శర్మ అనే న్యాయవాది ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఆర్టికల్ 267 కు లోబడి ఈ పీఎం కేర్స్ ఫండ్ ను పార్లమెంటు కానీ, రాష్ట్ర శాసన వ్యవస్థలు కానీ ఏర్పాటు చేయలేదని, దీనికి పార్లమెంటు ఆమోదం లేదని, రాష్ట్రపతి ఆమోదం అంతకన్నా లేదని, పైగా ఈ ఫండ్ ను ఏర్పాటు చేస్తున్నట్టు ఎలాంటి ఆర్డినెన్స్, గెజిట్ ఇవ్వలేదని పిటిషనర్ ఎంఎల్ శర్మ ఆరోపించారు.

ఈ వ్యాజ్యాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిశీలించిన చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే ఆధ్వర్యంలోని ధర్మాసనం... పీఎం కేర్స్ ఫండ్ ఏర్పాటును పిటిషనర్ తప్పుగా అర్థం చేసుకున్నారని భావిస్తూ వ్యాజ్యాన్ని కొట్టివేసింది. అంతేకాదు, ఈ ఫండ్ ను రాజ్యాంగంలోని 266, 267 ఆర్టికల్స్ ప్రకారం ఏర్పాటు చేయలేదన్న పిటిషనర్ అభిప్రాయాలను ధర్మాసనం అంగీకరించలేదు. కాగా, పీఎం కేర్స్ ఫండ్ కు ప్రధాని ఎక్స్ అఫిషియో చైర్మన్ గానూ, రక్షణ, హోం, ఆర్థిక మంత్రులు ఎక్స్ అఫిషియో ట్రస్టీలుగానూ వ్యవహరిస్తున్నారు.

More Telugu News