Biogen: ప్రాణాలు కాపాడాల్సిన ఔషధ కంపెనీ అమెరికాలో కరోనా వ్యాప్తికి కారణమైంది!

  • మార్చి మొదటి వారంలో అమెరికాలో బయోజెన్ కంపెనీ సమావేశం
  • బయోజెన్ సమావేశం అనంతరం పెరిగిన కరోనా వ్యాప్తి
  • బయోజెన్ ప్రతినిధులకు సోకిన కరోనా
  • ఆరు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన కేసులు
Biogen causes corona spreading in US

ప్రపంచంలో ఏ దేశంలో లేనంతగా అమెరికాలో కరోనా బీభత్సం కొనసాగుతోంది. ఇప్పటివరకు అక్కడ 5,61,103 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 22,106 మంది మృత్యువాత పడ్డారు. అంతటి అగ్రరాజ్యం సైతం ఈ మహమ్మారిని ఎదుర్కోలేక విలవిల్లాడుతోంది. అయితే, అమెరికాలో కరోనా వ్యాప్తికి ఓ ఔషధ కంపెనీ కూడా కారణం అంటే ఆశ్చర్యం కలగకమానదు. అమెరికాలో బయోజెన్ ఓ అగ్రశ్రేణి ఔషధ తయారీ సంస్థ. కొంతకాలంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న ఆ సంస్థను తాజాగా తయారుచేసిన అల్జీమర్స్ ఔషధం లాభాల బాటపట్టించింది. ఎన్నడూలేనంత స్థాయిలో అత్యధిక ఆదాయం నమోదైంది.

ఈ సంతోష సమయాన్ని పురస్కరించుకుని బయోజెన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మైకేల్ ఔనాట్సాస్ ఓ సమావేశం ఏర్పాటు చేసి కంపెనీ తాజా విజయప్రస్థానం గురించి గొప్పగా చెప్పారు. మార్చి మొదటి వారంలో జరిగిన ఈ సమావేశానికి అమెరికా నలుమూలల నుంచి బయోజెన్ కంపెనీకి చెందిన అనేకమంది సీనియర్ ఎగ్జిక్యూటివ్ లు కూడా హాజరయ్యారు. అయితే వారిలో కరోనా సోకినవారు కూడా ఉన్నారు. లక్షణాలు బయటపడకపోవడంతో సమావేశానికి రావడం, వారు మిగతావారికి అంటించడం జరిగిపోయాయి. ఈ సమావేశం ముగిసిన తర్వాత ఎవరి రాష్ట్రాలకు వారు వెళ్లిపోయారు.

ఇక్కడి నుంచే అమెరికాలో కరోనా కేసుల పెరుగుదల ప్రారంభమైంది. ముఖ్యంగా ఆరు రాష్ట్రాల్లో కరోనా వీరవిహారం మొదలైంది. బయోజెన్ సమావేశానికి హాజరైంది కొద్దిమందే అయినా, వారు ఈ ఆరు రాష్ట్రాలకు చెందినవారు కావడంతో విపరీతంగా వ్యాప్తి చెందింది. ఆరోగ్యాలను పరిరక్షించడానికి ఉద్దేశింపబడిన ఈ హెల్త్ కేర్ నిపుణులు చివరికి తామే ప్రమాదకర వైరస్ వ్యాప్తికి కారకులయ్యారు. ఈ కారణంగానే బయోజెన్ ప్రతినిధులను 'సూపర్ స్ప్రెడర్లు'గా భావిస్తున్నారు.

భారత్ లో ఢిల్లీ మర్కజ్ ఎలా వైరస్ వ్యాప్తికి కారణమైందో, అమెరికాలో బయోజెన్ సమావేశం కూడా ఇలాగే 'సూపర్ స్ప్రెడింగ్ ఈవెంట్' గా నిలిచింది. బయోజెన్ సమావేశం అనంతరం 99 మందికి కరోనా నిర్ధారణ కాగా, వారిలో బయోజెన్ ప్రతినిధులు, వారి సంబంధీకులు ఉన్నారు. అక్కడి నుంచి కరోనా అమితవేగంతో పాకినట్టు మసాచుసెట్స్ వైద్య విభాగం పేర్కొంది.

More Telugu News