రెండు సార్లు నెగిటివ్ వచ్చిందని ఇంటికి పంపిస్తే.. మూడోసారి కరోనా పాజిటివ్ తేలిన వైనం

13-04-2020 Mon 14:25
  • నోయిడాలో ఘటన
  • ఇంటికెళ్లే సమయంలో మూడో సారి శాంపిళ్లు తీసుకున్న వైద్యులు
  • మళ్లీ ఆసుపత్రికి బాధితులు
Coronavirus Two persons out of Noida hospital on Friday after testing negative for COVID

దేశంలో కరోనా కేసుల విజృంభణ నేపథ్యంలో మరో కలకలం చెలరేగుతోంది. మొదట నెగిటివ్ అని తేలి, మరోసారి చేసిన పరీక్షలో కరోనా పాజిటివ్‌గా తేలుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా లక్షణాలతో నోయిడా ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న ఇద్దరు వ్యక్తులు గత శుక్రవారం డిశ్చార్జ్‌ అయ్యారు. వారికి నెగిటివ్ అని తేలడంతో వైద్యులు ఇంటికి పంపించారు.  

అయితే, వారు మళ్లీ కరోనాతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. వారికి మూడో సారి కరోనా టెస్టులు చేయగా పాజిటివ్ అని తేలింది. నోయిడాలోని గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ (జిమ్స్)లో వారికి గత వారం పరీక్షలు చేశారు. దీంతో వారికి రెండు సార్లు నెగిటివ్ వచ్చింది. దీంతో వారిని డిశ్చార్జ్‌ చేశారు. అదే సమయంలో వారి నుంచి శాంపిల్స్ తీసుకుని, ఇంటికి పంపామని వైద్యులు వివరించారు.

దీంతో వారికి మూడోసారి చేసిన పరీక్షలో పాజిటివ్‌ వచ్చినట్లు తేలిందని తెలిపారు. దీనిపై పూర్తి వివరాలను కేంద్ర ప్రభుత్వానికి పంపామని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లోని గౌతమబుద్ధా నగర్‌లో అత్యధిక కరోనా కేసుల బాధితులున్నారు. అక్కడే  నోయిడాలోని ప్రాంతం కూడా ఉంటుంది. గౌతమబుద్ధా నగర్‌లోని పలు ప్రాంతాలను సీల్ చేసిన పోలీసులు అక్కడికి ఎవ్వరినీ వెళ్లనివ్వట్లేదు.