Lockdown: అటు ప్రాణం, ఇటు జీవనం ముఖ్యమనేలా... లాక్ డౌన్ కొనసాగింపు!

  • నేడు లాక్ డౌన్ పొడిగింపుపై విధివిధానాల వెల్లడి
  • 15 రకాల పరిశ్రమలకు అనుమతులు
  • రహదారులపై అన్ని రకాల లారీలకూ సడలింపు
Lockdown Extension will Focus on Life and Lifehood

గడచిన మూడు వారాలుగా అమలవుతున్న దేశవ్యాప్త లాక్ డౌన్ ను మరింకొంత కాలం పొడిగించేందుకు రంగం సిద్ధమైంది. ఇదే సమయంలో ప్రజల ప్రాణాలను కాపాడుకోవడంతో పాటు, ప్రజా జీవనంతో పాటు ఆర్థిక వృద్ధిని కొనసాగించడమే లక్ష్యంగా రెండో విడత లాక్ డౌన్ ఉంటుందని కేంద్ర వర్గాలు అంటున్నాయి.

నేడు ప్రధాని ఇందుకు సంబంధించిన విధి విధానాలను, కేంద్రం అనుసరించే వ్యూహాన్ని స్వయంగా వెల్లడిస్తారని తెలుస్తోంది. కనీసం మరో 15 రోజుల పాటు లాక్ డౌన్ ను పొడిగించాలని భావిస్తున్న కేంద్రం, తొలి విడత విధించిన నిబంధనల్లో కొన్నింటిని సడలిస్తుందని సమాచారం. కనీసం 15 రకాల పరిశ్రమలు, వీధి వ్యాపారులు తమ వ్యాపారం కొనసాగించేందుకు అనుమతి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు.

లాక్ డౌన్ కారణంగా ఆర్థిక కార్యకలాపాలకు విఘాతం కలుగగా, దాన్ని తిరిగి గాడిలోకి పెట్టడం ద్వారా, ప్రజా జీవనానికి ఆటంకం లేకుండా చూడాలని మోదీ భావిస్తున్నట్టు బీజేపీ సీనియర్ వర్గాలు వెల్లడించాయి. పలు రకాల పరిశ్రమలు ఒకే షిఫ్ట్ విధానంలో పని చేసుకునేందుకు అనుమతించాలని ఇప్పటికే కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ సిఫార్సు చేసింది.

వీటిల్లో ఎలక్ట్రికల్, టెలికం, కంప్రెషర్, కండెన్సర్ యూనిట్లతో పాటు, స్టీల్, లోహ ఉత్పత్తుల మిల్స్, స్పిన్నింగ్ మిల్స్, పవర్ లూమ్స్, రక్షణ రంగ పరికరాలు తదితరులు ఉన్నాయి. ప్యాకేజ్డ్ ఫుడ్ ఇండస్ట్రీకి కూడా పరిమితులతో కూడిన అనుమతులు లభించవచ్చు. ప్లాస్టిక్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్లు, ఆటోమోటివ్, జెమ్స్ అండ్ జ్యూయెలరీ యూనిట్లతో పాటు సెజ్ కార్యకలాపాలు, ఎగుమతి ఆధారిత యూనిట్లకు కూడా సడలింపులు ఇస్తారని తెలుస్తోంది.

ఇక, రేపటి నుంచే కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఉన్నతాధికారులు తమ విధులకు హాజరవుతారని, జాయింట్ సెక్రటరీలు, ఆపై స్థాయి అధికారులు, తమతమ కార్యాలయాల్లో మంగళవారం నాడు రిపోర్ట్ చేయాలని ఇప్పటికే ఆదేశాలు వెలువడ్డాయి. ఇక, జాతీయ రహదారులపై వాహనాల రాకపోకలకు అనుమతిస్తూ, కేంద్ర హోమ్ శాఖ, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకూ ఆదివారం నాడు ఆదేశాలు జారీ చేసింది. వివిధ రాష్ట్రాలను దాటి వెళ్లే రవాణా వాహనాలు, ట్రక్ లు, కోల్డ్ స్టోరేజీలకు పంటను తీసుకెళ్లే వాహనాలు, వేర్ హౌస్ ల నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే వాహనాల రాకపోకలకు అడ్డంకులు లేకుండా చూసుకోవాలని కేంద్రం ఆదేశించింది.

ఇక ఢిల్లీలో ఆజాద్ పూర్ మండీని ఉదయం 6 నుంచి 11 గంటల వరకూ, ఆపై మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ తెరచి ఉంచాలని, షాపులకు కేటాయించిన నంబర్ల ఆధారంగా, సరి సంఖ్య నంబర్లు ఒకరోజు, బేసి సంఖ్య నంబర్లున్న షాపులు మరుసటి రోజు తెరచుకోవచ్చని ఢిల్లీ ప్రభుత్వం ఆదేశించింది.

More Telugu News