Assom: అసోం, మేఘాలయాల్లో తెరచుకున్న మద్యం దుకాణాలు!

  • నిబంధనలు సడలించిన రాష్ట్రాల ప్రభుత్వాలు
  • రోజుకు 7 గంటల పాటు లిక్కర్ షాపులకు అనుమతి
  • కశ్మీర్ లోనూ తెరవాలని ఒమర్ అబ్దుల్లా డిమాండ్
Liquor Shops in Assom and Meglayala open from Today

కరోనా వైరస్ కారణంగా ప్రకటించిన లాక్ డౌన్ నుంచి ఈశాన్య రాష్ట్రాలు ఊరట పొందనున్నాయి. నేటి నుంచి నిబంధనలను అసోంతో పాటు మేఘాలయ కూడా సవరించనుంది. ఇందులో భాగంగా, మద్యం షాపులు తెరచుకున్నాయి. వీటితో పాటు హోల్ సేల్ వేర్ హౌస్ లు, బాట్లింగ్ ప్లాంట్లు, డిస్టిలరీస్, బ్రేవరీస్ ను రోజుకు 7 గంటల పాటు తెరచుకునేందుకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతించాయి. అయితే, కొన్ని నిబంధనలను ఫ్యాక్టరీలు, దుకాణాలు అమలు చేయాలని అధికారులు ఆదేశించారు.

లిక్కర్ షాపులు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ తెరచుకోవచ్చని, ఈ ప్రాంతాల్లో సామాజిక దూరం, పరిశుభ్రత పాటించడం తప్పనిసరని మేఘాలయ అధికారులు వెల్లడించారు. ఇదే సమయంలో అసోంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పరిమిత సంఖ్యలో ఉద్యోగులతో షాపులు తెరచుకోవచ్చని, ఉద్యోగులకు శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని అసోం ఎక్సైజ్ విభాగం ఆదేశించింది.

రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్రంలోని అన్ని జిల్లాల డిప్యూటీ కమిషనర్లకు తెలియజేశామని, మేఘాలయ ఎక్సైజ్ కమిషనర్ ప్రవీణ్ బక్షి తెలిపారు. గత కొన్ని రోజులుగా లిక్కర్ షాపులను తెరవాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోందని, విపక్ష బీజేపీ సైతం మద్యం షాపుల మూసివేతపై విమర్శలు గుప్పించిందని, దీనికితోడు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని, ఆ కారణంతోనే మద్యం దుకాణాలు తెరవాలని నిర్ణయించిందని ప్రభుత్వ ప్రతినిధి ఒకరు తెలిపారు.

కాగా, జమ్మూ కశ్మీర్ లో సైతం లిక్కర్ షాపులను తెరిపించాలన్న డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేస్తూ, అసోం, మేఘాలయా రాష్ట్రాల్లో మాదిరిగానే ఇక్కడా నిబంధనలను సడలించాలని ఆయన కోరారు.

More Telugu News