నా ప్రేమ రెండు సార్లు విఫలం కావడానికి కారణం ఇదే: నయనతార

13-04-2020 Mon 10:28
  • నమ్మకం ఉన్న చోటే ప్రేమ నిలబడుతుంది
  • నా ప్రేమలు విఫలం కావడానికి నమ్మకం లేకపోవడమే కారణం
  • సినిమాలే మళ్లీ నన్ను మనిషిని చేశాయి
Nayanatara reveals the reason behing her love breakups

వయసు పెరుగుతున్నా వెండి తెరపై నయనతార దూకుడు మాత్రం తగ్గడం లేదు. అగ్ర హీరోలతో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ఇదే సమయంలో తమిళ దర్శకుడు విఘ్నేశ్ తో ఆమె ప్రేమలో ఉంది. మరోవైపు, ఆమె జీవితంలో రెండు సార్లు ప్రేమ విఫలమైన సంగతి తెలిసిందే. ఈ ప్రేమ వైఫల్యాలపై ఆమె స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది.

ప్రేమ అంటేనే నమ్మకం అని... నమ్మకం లేని చోట ప్రేమ నిలవలేదని నయన్ తెలిపింది. ఒకరిపై మరొకరికి నమ్మకం లేనప్పుడు కలిసి జీవించడం కన్నా విడిపోవడమే మేలని చెప్పింది. రెండు సార్లు తన ప్రేమ విఫలం కావడానికి ఇదే కారణమని తెలిపింది. నమ్మకం లేకపోవడంతోనే వారితో బంధాన్ని తెంచుకున్నానని...  ఆ సమయంలో ఎంత బాధ అనుభవించానో తనకు మాత్రమే తెలుసని చెప్పింది. జనాలు మాత్రం ఎవరికి తోచిన విధంగా వారు అనుకున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ బాధ నుంచి బయటకు రావడానికి తనకు చాలా కాలం పట్టిందని... సినిమాలే తనను మళ్లీ మనిషిని చేశాయని తెలిపింది. కష్ట సమయంలో కూడా తన వెంట అభిమానులు ఉన్నారని కృతజ్ఞతలు తెలియజేసింది.