పోలీసులపై దాడికి దిగిన ముగ్గురికి కరోనా పాజిటివ్... అధికారుల్లో తీవ్ర ఆందోళన!

13-04-2020 Mon 10:22
  • ఇండోర్ లో దాడి చేసిన ముగ్గురు
  • సాత్నా, జబల్ పూర్ జైళ్లకు తరలింపు
  • వారిని తరలించిన వారు, జైలు అధికారులు క్వారంటైన్
Three Arrested for Attack on Police gets Corona Positive

లాక్ డౌన్ నిబంధనలను అమలు చేస్తున్న పోలీసులపై నాలుగు రోజుల నాడు దాడి జరుగగా, జాతీయ భద్రతా చట్టం కింద అరెస్ట్ చేసిన ముగ్గురు వ్యక్తులకు కరోనా పాజిటివ్ రావడం, ఇప్పుడు అధికారుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇండోర్ లోని కంటైన్ మెంట్ జోన్ పరిధిలో పోలీసులపై దాడి ఘటన జరుగగా, అరెస్ట్ చేసిన వారిలో ఇద్దరిని సాత్నా జైలుకు, ఒకరిని జబల్ పూర్ జైలుకు శుక్రవారం నాడు తరలించారు. ఈ ముగ్గురికీ పరీక్షలు చేయించగా, ముగ్గురూ కరోనా పాజిటివ్ అని తేలడంతో, జిల్లా అధికారులు అప్రమత్తం అయ్యారు.

ఇంతవరకూ సాత్నా జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. తాజా ఘటనతో వీరితో సంబంధాలున్న వారిని గుర్తించేందుకు అధికారులు ఉరుకులు, పరుగులు పెడుతున్నారు. వీరు ముగ్గురినీ జైలుకు పంపేముందు పరీక్షలు నిర్వహించాలని పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని తెలుస్తోంది. ఈ కొత్త కేసుతో సహా జబల్ పూర్ లో కరోనా పాజిటివ్ కేసులు 9కి పెరుగగా, ఇండోర్ లో 311 మంది చికిత్స పొందుతున్నారు.

"ఇండోర్ పోలీసుల నుంచి మాకు ముందుగా సమాచారం అందలేదు. వారిని జైలు వద్దకు తీసుకుని వచ్చిన తరువాతే వారు చేసిన నేరం గురించి తెలిసింది. వారిని ఐసొలేషన్ జైలు గదిలో ఉంచాం. ఆపై జబల్ పూర్ నిందితుడికి పాజిటివ్ రావడంతో, వీరికి కూడా పరీక్షలు చేయించగా, పాజిటివ్ అని తెలిసింది" అని సాత్నా జిల్లా కలెక్టర్ అజయ్ కటేసారి వెల్లడించారు. దీంతో జైలులో గత రెండు రోజులుగా వీరిని కలిసిన అధికారులను హోమ్ క్వారంటైన్ చేసి, ఖైదీలను ఐసొలేషన్ సెల్స్ లోకి తరలించామని అన్నారు. వీరిని జైలుకు తరలించడంలో సాయపడిన ఎనిమిది మంది పోలీసులకు సమాచారం ఇచ్చి, క్వారంటైన్ చేశామని వెల్లడించారు.