Lockdown: లాక్‌డౌన్‌లోనూ మత్తులో జోగుతున్న జనం.. హైదరాబాదులో యథేచ్ఛగా విక్రయాలు

  • అర్ధరాత్రి వేళ షాపులు ఓపెన్ చేసి సీసాలు బయటకు
  • ప్రత్యేక ఏజెంట్ల ద్వారా విక్రయం
  • ఒక్కో సీసాకు రూ. 500 వరకు కమిషన్
Liquor selling continue in Hyderabad

లాక్‌డౌన్‌లోనూ హైదరాబాద్‌లోని మందుబాబులు మత్తులో జోగుతున్నారు. నగరంలో లాక్‌డౌన్ ఆంక్షలు కఠినంగా ఉన్నప్పటికీ మద్యం అమ్మకాలను మాత్రం ఇవి అడ్డుకోలేకపోతున్నాయి. మద్యం దుకాణదారులు, బార్లు, రెస్టారెంట్ల నిర్వాహకులు ప్రత్యేకంగా ఏజెంట్లను నియమించుకుని రహస్యంగా దందా నిర్వహిస్తున్నారు.

లాక్‌డౌన్ ప్రారంభమైన రెండో రోజు నుంచే నగరంలో మద్యం విక్రయాలు మొదలైనట్టు తెలుస్తోంది. తాజాగా, మల్కాజిగిరి లోని ఏడు ప్రాంతాల్లో ఈ దందా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఇటీవల ఓ వ్యక్తి కారులో భారీగా మద్యం సీసాలు తరలిస్తూ పట్టుబడ్డాడు. అల్వాల్, బొల్లారం నుంచి కారులో రోజు విడిచి రోజు మద్యాన్ని తీసుకెళ్లి ఘట్‌కేసర్ తదితర ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

అర్ధరాత్రి వేళ గోదాములు, దుకాణాలను తెరిచి అందులోని మద్యం సీసాలను బయటకు తీసుకొచ్చి రహస్యంగా దాస్తున్నారు. అనంతరం వాటిని ఏజెంట్లతో గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్నారు. మేడిపల్లిలోని ప్రియా బార్ అండ్ రెస్టారెంట్ నిర్వాహకులు ఇలాంటి దందాకు పాల్పడగా ఎస్ఓటీ పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

 కాగా, అక్రమంగా బయటకు తీసుకొచ్చిన మద్యాన్ని డిమాండ్‌ను బట్టి భారీగా విక్రయిస్తున్నారు. మంచి బ్రాండ్ అయితే ఫుల్ బాటిల్‌ను రూ. 5 వేల వరకు విక్రయిస్తున్నారు. ఒక్కో సీసాకు రూ. 200 నుంచి రూ. 500 వరకు కమిషన్ ఇస్తున్నట్టు పట్టుబడిన విద్యార్థి ఒకరు చెప్పడం చూస్తుంటే దందా ఏ మేర సాగుతుందో అర్థం చేసుకోవచ్చు.

More Telugu News