కొనసాగుతున్న కరోనా విలయం.. 18 లక్షలు దాటిన కేసులు.. మరణాలకు పడని అడ్డుకట్ట!

13-04-2020 Mon 07:33
  • 1.12 లక్షల మంది మృత్యువాత
  • అమెరికాలో 20 వేలు దాటిన మరణాలు
  • రష్యాలో ఒక్క రోజే రెండు వేలకు పైగా కేసుల నమోదు
Corona cases crossed 18 lakhs and death toll also raised

ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం కొనసాగుతోంది. ఈ మహమ్మారి బారినపడిన వారి సంఖ్య ఆదివారం నాటికి 18 లక్షలు దాటింది. 1.12 లక్షల మంది ఈ వైరస్‌కు బలయ్యారు. ఒక్క అమెరికాలోనే 20 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక బాధితుల సంఖ్య అయితే చెప్పక్కర్లేదు. ఇప్పటి వరకు 5.3 లక్షల మందికిపైగా కోవిడ్ బారినపడ్డారు. మరోవైపు, భారత్‌లోనూ కరోనా ప్రతాపం చూపిస్తోంది.
అమెరికాలో వైరస్‌ బారినపడి ఆసుపత్రుల్లో చేరుతున్న ప్రతి పదిమంది మధ్య వయస్కుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోతుండగా, 85 ఏళ్లు దాటినవారు ప్రతి పదిమందిలో నలుగురు మృత్యువాత పడుతున్నట్టు ఓ అధ్యయనం తెలిపింది. నిన్నమొన్నటి వరకు దారుణ పరిస్థితులున్న న్యూయార్క్ ప్రస్తుతం కోలుకుంటోంది. రాష్ట్రంలో కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నట్టు అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు.

మరోవైపు, రష్యాలోనూ కేసుల తీవ్రత పెరుగుతోంది. 24 గంటల్లోనే అక్కడ ఏకంగా 2,186 కేసులు నమోదయ్యాయి. ఒక్క మాస్కోలోనే 1306 మంది కరోనా బారిన పడ్డారు. వీటితో కలుపుకుని రష్యాలో ఆదివారం నాటికి నమోదైన కేసుల సంఖ్య 15,770కి చేరుకుంది. అలాగే, 130 మంది ప్రాణాలు విడిచారు. స్పెయిన్‌లో మరణాలు కొనసాగుతున్నాయి. శనివారం కొంత ఊరటనిచ్చిన కేసులు, మరణాలు.. ఆదివారం మళ్లీ పెరిగాయి. నిన్న ఒక్క రోజే అక్కడ 619 మంది మృతి చెందారు. గత 24 గంటల్లో ఇటలీలోనూ అంతే సంఖ్యలో మరణాలు నమోదయ్యాయి. పాకిస్థాన్‌లో నిన్న కొత్తగా 386 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 5,170కి పెరిగింది.