భర్తతో గొడవ.. ఐదుగురు పిల్లలను గంగలోకి తోసేసిన తల్లి!

12-04-2020 Sun 20:24
  • ఉత్తరప్రదేశ్ లోని జహంగీరాబాద్ లో ఘటన
  • మృదుల్ యాదవ్, మంజు యాదవ్ లు భార్యభర్తలు.
  • ముగ్గురు ఆడపిల్లలు, ఇద్దరు మగ పిల్లలను నదిలోకి తోసేసిన మంజు?
Woman Allegedly Throws 5 Children Into Ganga
కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ తన పిల్లలను గంగా నదిలోకి తోసేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్ లోని జహంగీరాబాద్ లో జరిగింది. ఎస్పీ రామ్ బదాన్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం, మృదుల్ యాదవ్, మంజు యాదవ్ లు భార్యభర్తలు. గత ఏడాదిగా వీరి మధ్య తరచు గొడవలు జరుగుతుండేవి.

ఈ క్రమంలో నిన్నకూడా వాళ్లిద్దరూ గొడవపడ్డారు. దీంతో, తన ఐదుగురు పిల్లలను నదిలోకి తోసేసి చంపేయాలని మంజు యాదవ్ భావించినట్టు ఆరోపించారు. ఆర్తి, సరస్వతి, మాతేశ్వరి, శివశంకర్, కేశవ్ ప్రసాద్ లను నిన్న అర్థరాత్రి సమయంలో జహంగీరాబాద్ లో ఉన్న గంగా నది వద్దకు తీసుకువెళ్లి అందులోకి తోసేందని ఆరోపించారు.

జహంగీరాబాద్ ఘాట్ వద్ద నది చాలా లోతుగా ఉంటుందని, మృతదేహాల కోసం గాలిస్తున్నామని ఎస్పీ చెప్పారు. మంజు తన పిల్లలను తీసుకుని ఘాట్ వద్దకు వెళ్లిన సమయంలో ఆ పిల్లలు కేకలు వేయడాన్ని అక్కడి  మత్స్యకారులు గమనించారు కానీ, ఆమెను ఓ మంత్రగత్తెగా భావించి వారు పారిపోయారని పోలీసులు తెలిపారు.