punjab: లాక్‌డౌన్‌ నేపథ్యంలో రోడ్డుపై ఆపినందుకు కలకలం.. పోలీసు చేతిని నరికేసిన వైనం.. వీడియో ఇదిగో

  • పంజాబ్‌లో ఘటన
  • మరో ఇద్దరు పోలీసులకు గాయాలు
  • కర్ఫ్యూ పాసులు చూపించాలని అడిగిన పోలీసులు
  • వాహనంతో ఢీ కొట్టి, కత్తితో దాడి
Punjab policemans hand chopped two others injured in attack by group defying coronavirus lockdown

కరోనా విజృంభణ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ను అమలు చేసేందుకు శ్రమిస్తోన్న పోలీసులపై దాడులు జరుగుతుండడం కలకలం రేపుతోంది. పంజాబ్‌లోని పటియాలా జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పోలీసులపై కొందరు  దాడి చేశారు.  

ఈ దాడిలో ఓ పోలీసు చేతిని నరికేసి, మరో ఇద్దరి పోలీసు అధికారులను తీవ్రంగా గాయపర్చారని పోలీసులు ప్రకటించారు. సిక్కు వర్గానికి చెందిన నిహంగ్స్‌ ఈ ఘటనకు పాల్పడ్డారని వివరించారు. వారంతా వాహనంలో కూరగాయల మార్కెట్‌ మీదుగా వెళ్తున్న సమయంలో పోలీసులు వారిని ఆపి ప్రశ్నించారు. కర్ఫ్యూ పాసులు చూపించాలని వారిని పోలీసులు కోరారు.  

దీంతో వారు తమ వాహనంతో గేటును, బారికేడ్లను ఢీ కొట్టారు. అనంతరం ఆ బృందంలోని సభ్యులు పోలీసులపై దాడి చేశారు. అసిస్టెంట్‌ సబ్ ఇన్‌స్పెక్టర్‌ చేతిని కత్తితో నరికేశారని పటియాలా పోలీసులు మీడియాకు వివరించారు. మరో ఇద్దరు పటియాలా పోలీసుల చేతులపై గాయాలయ్యాయని తెలిపారు.  

గాయాలపాలైన పోలీసులకు ఆసుపత్రుల్లో చికిత్స అందుతోందని చెప్పారు. ఈ దాడికి పాల్పడిన అనంతరం నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. వారిని పట్టుకోవడానికి పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు.    
 
కాగా, పంజాబ్‌లో కరోనా కేసులు క్రమంగా పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 151 కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌.. లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలు పొడిగిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటన చేశారు. దేశ వ్యాప్తంగానూ పొడిగించాలని ఆయన నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కూడా సూచించారు. ఈ నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌ నిబంధనలు అమలు చేస్తున్నారు.

More Telugu News