Corona Virus: ఇప్పటికి కేసుల సంఖ్య తక్కువే అయినా... భవిష్యత్ హాట్ స్పాట్ దక్షిణాసియా: వరల్డ్ బ్యాంక్ హెచ్చరిక

  • ఆర్థిక క్లిష్ట పరిస్థితి కుదిపేయనుంది
  • పేదరికంపై జరుపుతున్న పోరాటానికి విఘాతం
  • తాజా నివేదికలో హెచ్చరించిన వరల్డ్ బ్యాంక్
Future Corona Hotspot is South Asia

గడచిన నాలుగు దశాబ్దాల్లోనే ఎన్నడూ లేనంత ఆర్థిక క్లిష్ట పరిస్థితి దక్షిణాసియాను కుదిపేయనుందని, దీని కారణంగా ఎన్నో ఏళ్ల తరబడి పేదరికంపై జరుపుతున్న పోరాటం వృథా కానుందని వరల్డ్ బ్యాంక్ హెచ్చరించింది. దీనికి కారణం కరోనా వైరస్ మహమ్మారేనని అంచనా వేసింది. దాదాపు 180 కోట్లకు పైగా జనాభాను కలిగివున్న ఇండియా, బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఆఫ్గనిస్థాన్ తదితర దక్షిణాసియాలోని చిన్న దేశాల్లో జన సాంధ్రత చాలా అధికమని గుర్తు చేసింది. ఇక్కడి నగరాల్లో ప్రజలు కిక్కిరిసి ఉంటారని, ఇప్పటివరకూ వెలుగుచూసిన కరోనా కేసుల సంఖ్య తక్కువే అయినప్పటికీ, భవిష్యత్తులో ఈ దేశాలు కరోనా హాట్ స్పాట్ లుగా మారనున్నాయని పేర్కొంది.

ఇప్పటికే లాక్ డౌన్ కారణంగా ఈ దేశాల్లో ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిన్నాయని, సాధారణ జీవనం క్లిష్టతరమైపోగా, పశ్చిమ దేశాల నుంచి వచ్చే ఆర్డర్లు రద్దయ్యాయని, పేద కార్మికులు ఒక్కసారిగా ఉపాధిని కోల్పోయారని, అటువంటి వారి సంఖ్య చాలా ఎక్కువని పేర్కొంది. "దక్షిణాసియా దేశాలు కరోనా మహమ్మారి కారణంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోనున్నాయి. ఇప్పటికే టూరిజం ఇండస్ట్రీ పాతాళానికి దిగజారింది. సప్లయ్ చైన్ దెబ్బతింది. గార్మెంట్స్ కు డిమాండ్ పడిపోయింది. అటు వినియోగదారుల, ఇటు పెట్టుబడిదారుల సెంటిమెంట్ నశించింది" అని వరల్డ్ బ్యాంక్ తన తాజా నివేదికలో పేర్కొంది.

కరోనా మహమ్మారి వ్యాపించక ముందు తాము అంచనా వేసిన 6.3 శాతం వృద్ధి రేటు అంచనాలను ఇప్పుడు 1.8 నుంచి 2.8 శాతానికి తగ్గిస్తున్నామని, దక్షిణాసియాలోని సగం దేశాలు తీవ్రమైన మాంద్యంలోకి కూరుకుపోనున్నాయని వరల్డ్ బ్యాంక్ హెచ్చరించింది. ముఖ్యంగా టూరిజంపైనే ప్రధానంగా ఆధారపడిన మాల్దీవులపై ఈ ప్రభావం అధికంగా ఉంటుందని, ఆపై ఆఫ్గనిస్థాన్, పాకిస్థాన్ దేశాలపై ప్రభావం ఉంటుందని అంచనా వేసింది. ఈ రీజియన్ లో బలంగా ఉన్న ఇండియా, ఏప్రిల్ 1 నుంచి మొదలయ్యే ఆర్థిక సంవత్సరం విషయాన్ని పక్కన పెడితే, ఇటీవల ముగిసిన సంవత్సరంలో 1.5 నుంచి 2.8 శాతం వృద్ధిని మాత్రమే నమోదు చేయవచ్చని పేర్కొంది.

ఇక కరోనా మహమ్మారి దక్షిణాసియాలో అసమానతలను పెంచనుందని, వైద్య సేవలను పొందలేని వారు, సామాజిక భద్రతను పొందలేని పేదలపై వైరస్ ప్రభావం ఎంతో ఎక్కువని వరల్డ్ బ్యాంక్ తన నివేదికలో పేర్కొంది. ప్రపంచంలోనే అతిపెద్ద లాక్ డౌన్ ప్రస్తుతం ఇండియాలో అమలవుతోందని గుర్తు చేస్తూ, దీని కారణంగా లక్షలాది మంది వలస కార్మికులు అవస్థలు పడుతున్నారని, వారంతా కాలినడకన తమతమ స్వస్థలాలకు వెళుతున్నారని పేర్కొంది.

ఇక ప్రభుత్వం కల్పించుకుని, ఆరోగ్య అత్యయిక పరిస్థితిని చక్కదిద్దాలని, దేశ ప్రజలను కాపాడుకునేందుకు చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా పేదలు, ఆకలి తదితర అవసరాలు తీర్చుకునేందుకు ఇబ్బందులు పడుతున్న వారికి సాయపడాలని సూచించింది. అవసరమైన ప్రాంతాలకు చాలినన్ని ఔషధాలు, ప్రతి ఒక్కరి ఆకలి తీర్చడం ప్రభుత్వం బాధ్యతగా తీసుకోవాలని సూచించింది. వలస కార్మికుల కోసం తాత్కాలిక పనులను కల్పిస్తూ ఆదుకోవాలని, చిన్న, మధ్య తరహా కంపెనీల యాజమాన్యాలకు మరిన్ని రుణాలను దగ్గర చేయాలని సిఫార్సు చేసింది.

ఇక వచ్చే 15 నెలల వ్యవధిలో పలు పేద దేశాలను ఆదుకునేందుకు తాము 160 బిలియన్ డాలర్లను సిద్ధం చేస్తున్నామని వరల్డ్ బ్యాంక్ వెల్లడించింది. ఈ నిధులతో వ్యాపారాలకు మద్దతిస్తామని, తద్వారా ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిలో పడేందుకు ఊతం లభిస్తుందని అంచనా వేసింది. 

More Telugu News