IndiGo: దేశంలో తొలిసారి విమానయాన సిబ్బంది కరోనాతో మృతి

  • చెన్నైలో ఇండిగో ఇంజనీర్ మృతి
  • ప్రకటించిన ఇండిగో సంస్థ
  • ఆయన వివరాలు వెల్లడించని ఇండిగో
IndiGo Employee Dies Of Coronavirus Infection In Chennai

తమ సిబ్బందిలో ఒకరు కరోనా వైరస్‌ సోకి చెన్నైలో ప్రాణాలు కోల్పోయారని భారత విమానయాన సంస్థ ఇండిగో తెలిపింది. అయితే, ఈ విషయంపై ఆ సంస్థ ఎటువంటి వివరాలు వెల్లడించలేదు. అయితే, మీడియాకు తెలిసిన వివరాల ప్రకారం.. ప్రాణాలు కోల్పోయిన ఆ వ్యక్తి విమాన నిర్వహణ ఇంజనీరుగా పనిచేస్తున్నాడు. శుక్రవారం అతడు ప్రాణాలు కోల్పోయాడు.

అతడికి దాదాపు 50 ఏళ్లు ఉంటాయి. ఆ విమానయాన సంస్థలో అతడు 2006 నుంచి పనిచేస్తున్నాడు. ఉద్యోగం నిమిత్తం చెన్నైలోనే ఉంటున్నాడు. 'మా విమానయాన సంస్థలో పనిచేస్తోన్న ఓ వ్యక్తి చెన్నైలో కొవిడ్‌-19తో మృతి చెందినందుకు విచారం వ్యక్తం చేస్తున్నాం' అని ఇండిగో ప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు.  

విమానయన సంస్థకు చెందిన వ్యక్తి కరోనాతో మృతి చెందడం దేశంలో ఇదే మొదటిసారి. 'ఇండిగో సిబ్బంది అందరికీ ఇది చాలా బాధ కలిగించే విషయం. ఈ బాధాకర సమయంలో ఆయన కుటుంబానికి అండగా నిలబడతాం. ఆయన కుటుంబం వివరాలు తెలపకుండా గోప్యతను పాటిస్తాం' అని ఇండిగో ప్రతినిధి ఒకరు తెలిపారు. కాగా, దేశంలో కరోనా బాధితుల సంఖ్య 8,356కు చేరింది. మృతుల సంఖ్య 273కి పెరిగింది.

More Telugu News