K Narayana Swamy: నా మాటలు బాధించి వుంటే క్షమించండి: ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి నారాయణస్వామి

  • మర్కజ్ కారణంగానే కరోనా పెరిగిందన్న డిప్యూటీ ముఖ్యమంత్రి 
  • రక్త పరీక్షలకు ముందుకు రావడం లేదని మండిపాటు
  • విమర్శలు రావడంతో ట్విట్టర్ లో క్షమాపణలు
YCP MLA Narayanaswamy says Sorry

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలను వివరిస్తున్న వేళ, తాను చేసిన వ్యాఖ్యలపై ఓ వర్గం వారి నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో డిప్యూటీ ముఖ్యమంత్రి కే నారాయణస్వామి నష్ట నివారణ చర్యలకు దిగారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ ను పెట్టిన ఆయన, "కరోనా మహమ్మారి నుంచి అందరూ బయటపడాలనే ఉద్దేశ్యంతో ఢిల్లీ వెళ్లి వచ్చిన వారు మరియు వారితో కలిసి మెలిగినవారు పరీక్షలు చేయించుకుని, వైద్యం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్న క్రమంలో నా మాటలు ఏవైనా బాధించి ఉంటే క్షమాపణలు కోరుతున్నాను. ఆ వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకుంటున్నాను" అని వ్యాఖ్యానించారు.

కాగా, మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి కారణంగానే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరిగిందని, వారిలో చాలా మంది వైద్య పరీక్షలకు ముందుకు రావడం లేదని, కావాలనే వారు అలా చేస్తున్నారని తాజాగా, నారాయణస్వామి చేసిన వ్యాఖ్యలను పలువురు ఖండించిన సంగతి తెలిసిందే. నారాయణస్వామి వ్యాఖ్యలు సమాజంలో విద్వేషాలను, మత కల్లోలాలను పెంచేలా ఉన్నాయని మైనారిటీ నేతలు మండిపడ్డారు.

More Telugu News