Lockdown: ఈ సంవత్సరం ఐపీఎల్ రద్దు!

  • మరింత కాలం కొనసాగనున్న లాక్ డౌన్
  • కేంద్రం ప్రకటించగానే, ఐపీఎల్ రద్దుపై సమాచారం
  • వెల్లడించిన బీసీసీఐ అధికారి
This Year IPL Indefinite Postpone

ప్రతి సంవత్సరమూ వేసవిలో క్రికెట్ అభిమానులను అలరించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఈ సంవత్సరం పూర్తిగా రద్దు కానున్నాయి. ఐపీఎల్ పోటీలను నిరవధికంగా వాయిదా వేయడంపై అధికారిక ప్రకటన మాత్రమే వెలువడాల్సి వుందని బీసీసీఐ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఏప్రిల్ 30 వరకూ లాక్ డౌన్ ను పొడిగించాలని కేంద్రం భావిస్తుండటం, ఇందుకు స్పష్టమైన సంకేతాలు వెలువడటంతో, లాక్ డౌన్ పొడిగింపుపై కేంద్రం నుంచి ప్రకటన రాగానే, ఐపీఎల్ ను రద్దు చేస్తున్నట్టు అధికారిక సమాచారం వస్తుందని అంచనా వేస్తున్నారు.

ఈ సంవత్సరం ఐపీఎల్ ను రద్దు చేయడం మినహా మరోదారి లేదని భావిస్తున్న బీసీసీఐ, వీలైతే, షెడ్యూల్ ను కుదించి, అక్టోబర్, నవంబర్ మధ్య కాలంలో, ఐసీసీ షెడ్యూల్ ను అనుసరించి, ఖాళీ దొరికితే నిర్వహించే అవకాశాలను తదుపరి పరిశీలిస్తామని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.

కాగా, గత నెలలో ఐపీఎల్ పోటీలను ఏప్రిల్ 15 వరకూ వాయిదా వేస్తున్నట్టు గవర్నింగ్ బాడీ వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే, కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ, 8 వేలను దాటడం, వైరస్ నియంత్రణ నిమిత్తం కఠిన చర్యలను కేంద్రం తీసుకోనున్న నేపథ్యంలో ఐపీఎల్ జరిగే అవకాశాలు లేవని బీసీసీఐ అధికారులు అంటున్నారు.

More Telugu News