Corona Virus: ఇండియాలో ప్రబలుతున్న కరోనా... ఒక్కరోజులో 1000 దాటిన పాజిటివ్ లు!

  • శనివారం నాడు 1,035 కొత్త కేసులు
  • తాజాగా 40 మంది మరణం
  • లక్షకు పైగా ఐసొలేషన్ పడకలు సిద్ధమన్న కేంద్రం
Above Corona Positive 1000 Cases in India in A Single Day

ఇండియా కరోనా వైరస్ రోజురోజుకూ మరింతగా ప్రబలుతోంది. దేశంలో ఒక్క రోజులో నమోదైన కేసుల సంఖ్య తొలిసారిగా 1000 దాటింది. శనివారం ఒక్కరోజులో దేశవ్యాప్తంగా, 1,035 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. ఇదే సమయంలో తాజాగా 40 మంది మరణించగా, మృతుల సంఖ్య 242 కు చేరిందని, కరోనా కేసుల సంఖ్య 7,529 అని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ వ్యాఖ్యానించారు. లాక్ డౌన్ ను దేశంలో పటిష్ఠంగా అమలు చేస్తున్న కారణంతో కేసుల సంఖ్య అదుపులో ఉందని, లేకుంటే ఈపాటికి 2.08 లక్షలకు, ఈ నెల 15 నాటికి 8.2 లక్షలకు చేరుండేదని ఆయన అంచనా వేశారు.

ప్రస్తుతం దేశంలోని 586 ఆసుపత్రుల్లో కరోనా రోగులకు చికిత్స అందుతోందని, లక్షకు పైగా ఐసొలేషన్ పడకలు, 11,836 ఐసీయూ పడకలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఇదే సమయంలో కరోనా చికిత్సకు వాడుతున్న మలేరియా నివారిణి హైడ్రాక్సీ క్లోరోక్విన్ కు ఎలాంటి కొరతా లేదని స్పష్టం చేశారు. ఢిల్లీలోని స్టేట్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ లో ఓ డాక్టర్ సహా 11 మందికి పాజిటివ్ రావడంతో, ఆ ఆసుపత్రిని తాత్కాలికంగా మూసేశామని తెలిపారు.

ఇదే సమయంలో 17 రాష్ట్రాల్లోని 71 జిల్లాల్లో మాత్రమే 80 శాతం కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి హర్షవర్ధన్  వ్యాఖ్యానించారు. మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారిలో ఇంకా కొందరు అజ్ఞాతంలోనే ఉండి, కరోనా పరీక్షలకు ముందుకు రావడం లేదని వెల్లడించిన ఆయన, అటువంటి వారి ఆచూకీ చెబితే, రూ. 5 వేల రివార్డు ఇస్తామని ప్రకటించారు.

More Telugu News