Indore: మహమ్మారి మరణాలకు కేంద్రంగా ఇండోర్ ఆసుపత్రి... 72 శాతం అక్కడే!

  • లాక్ డౌన్ తో మూగబోయిన ఇండోర్
  • ఏకంగా 11 శాతానికి పెరిగిన డెత్ రేట్
  • ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కొరత

నిత్యమూ వాణిజ్య, సాంస్కృతిక కార్యక్రమాలతో సందడిగా కనిపించే మధ్యప్రదేశ్ రాజధాని ఇండోర్ ఇప్పుడు మూగబోయింది. కరోనా మహమ్మారి కాటేయడం, లాక్ డౌన్ తో ప్రజలు వీధుల్లోకి రావడం మానేశారు. రాష్ట్రంలోనే కరోనాకు ప్రధాన హాట్ స్పాట్ గా ఇండోర్ మారిపోయింది. జాతీయ స్థాయిలో కరోనా కారణంగా మరణాలతో పోలిస్తే, ఇండోర్ లో మూడు రెట్లు అధిక మరణాలు నమోదవుతున్నాయి. ఇక్కడ డెత్ రేట్ ఏకంగా 11 శాతానికి పెరిగిపోయింది. అంటే, ఇండోర్ లో వైరస్ సోకిన ప్రతి 100 మందిలో 11 మంది మరణిస్తున్నట్టు లెక్క. ఇదే ఇప్పుడు అధికారులను తీవ్ర ఆందోళనలో పడేస్తోంది.

ఇప్పటివరకూ మధ్యప్రదేశ్ లో 451 కొవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అందులో సగానికి పైగా కేసులు ఇండోర్ వే. ఇక దేశ స్థాయిలో అత్యంత పరిశుభ్రమైన నగరంగా వరుసగా మూడు సార్లు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఇండోర్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో మరణాల రేటు మరింత అధికంగా ఉంది. రాష్ట్రంలో ఇప్పటివరకూ 36 మంది మరణించగా, 27 మంది ఇండోర్ లోనే తుది శ్వాస విడిచారు.

ఈ నెల ఆరంభం నుంచి 9వ తేదీ వరకూ మహూ నాక్ శ్మశానానికి 64 మృతదేహాలు అంతిమ సంస్కారం కోసం వచ్చాయి. ఖజ్ రానా శ్మశానానికి 34, సిర్ పూర్ శ్మశానానికి 29, లునియాపురా శ్మశానానికి 56 మృతదేహాలు వచ్చాయి. ఒక్క మార్చి 8నే 130 మృతదేహాలను ఖననం చేయాల్సి వచ్చిందని, అంతకుముందు జనవరిలో 113 మంది, ఫిబ్రవరిలో 98 మందిని మాత్రమే ఖననం చేశామని ఇక్కడి అధికారులు వెల్లడించారు.

ఇక, మృతుల్లో అత్యధికుల్లో రక్తపోటు, మధుమేహం తదితర ఇతర సమస్యలు ఉన్నాయని, ఆ కారణంతోనే వీరు కరోనా చికిత్స సమయంలో మరణించారని అధికారులు వెల్లడించారు. ఇక ఆసుపత్రుల్లో వెంటిలేటర్ల సమస్య కూడా అధికంగానే ఉంది. తన తండ్రి డయాబెటిస్, బ్లడ్ ప్రజర్ తో బాధపడుతూ, కరోనా సోకి ఆసుపత్రిలో చేరారని, ఆయనకు సరైన సమయంలో వెంటిలేటర్ అందించడంలో విఫలమైనందునే ప్రాణాలు పోయాయని అర్షద్ అన్సారీ అనే యువకుడు వాపోయాడు. ఊపిరి పీల్చుకోవడానికి తన తండ్రి ఇబ్బంది పడుతూ ఉంటే, ఆక్సిజన్ సిలిండర్ ను కూడా తీసుకుని రాలేదని వాపోయాడు.

ప్రస్తుతం ఇండోర్ లోని కరోనా కేసుల్లో ముస్లింలు అధికంగా నివసించే ఖజ్రానా, చందానగర్, రాణిపురా, తపతి బఖాల్, సిల్వపాత్రా తదితర ప్రాంతాలకు చెందిన వారే అధికమని అధికారులు వెల్లడించారు. ఇక, ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కొరతపై జిల్లా కలెక్టర్ మనీశ్ సింగ్ స్పందిస్తూ, ఇది తన దృష్టికి వచ్చిందని, ఈ విషయంలో హాస్పిటల్స్ కు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తామని వెల్లడించారు.

More Telugu News