నిన్నటిదాకా మాస్కెందుకని ఎగతాళి చేసిన టిక్ టాక్ స్టార్... నేడు కరోనా సోకి ఆసుపత్రిలో చేరిక!

11-04-2020 Sat 17:09
  • దేవుడిని నమ్ముకుంటే చాలని వీడియోలు
  • సోదరి ఇంటికి వెళ్లి రావడంతో సోకిన కరోనా
  • ఆసుపత్రి బెడ్ పై నుంచి కూడా వీడియోలు
  • స్మార్ట్ ఫోన్ ను లాగేసుకున్న పోలీసులు
Madhyapradesh Tiktok Star in Hospital With Corona

అతను మధ్యప్రదేశ్ లో ఓ టిక్ టాక్ స్టార్. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న వేళ, మాస్క్ లను ధరించడం వేస్టని ఎగతాళి చేస్తూ, దేవుడిని నమ్ముకుంటే చాలని ఎగతాళి చేస్తూ, వీడియోలు పోస్ట్ చేశాడు. నిన్నటిదాకా ప్రగల్బాలు పలికిన అతన్ని కరోనా మహమ్మారి పట్టేసుకుంది. కరోనా సోకిన విషయం తెలియకుండా ఇరుగు పొరుగులను కూడా ప్రమాదంలోకి నెట్టిన అతను, ఇప్పుడు ఆసుపత్రిలో ఐసొలేషన్ వార్డులో పడ్డాడు. తన కోసం ప్రార్థించాలంటూ ఆ తరువాత కూడా అతను వీడియోలు పోస్ట్ చేయడం గమనార్హం.

కాగా, జబల్పూర్ లోని తన సోదరి ఇంటికి వెళ్లి వచ్చిన తరువాత ఈ టిక్ టాక్ స్టార్ లో కరోనా లక్షణాలు కనిపించాయి. ఆపై పరీక్షలు చేయించగా, పాజిటివ్ రావడంతో,  బుందేల్ ఖండ్ మెడికల్ కాలేజీకి తరలించారు. ఆసుపత్రి బెడ్ పై నుంచి కూడా వీడియోలు పెట్టడంతో, స్పందించిన పోలీసులు, అతన్నుంచి స్మార్ట్ ఫోన్ ను లాక్కున్నారు. ఇక, అతని బాధ్యతా రాహిత్యం కారణంగా చుట్టుపక్కల వారు, కుటుంబీకులు సహా మొత్తం 50 మంది క్వారంటైన్ కావాల్సి వచ్చింది.

ఇక, రాష్ట్ర పరిధిలోని సాగర్ జిల్లాలో ఇదే తొలి కరోనా కేసు కావడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తం అయింది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ ప్రీతీ మైథిల్ ఓ ప్రకటన వెలువరించారు. ప్రస్తుతం రోగి పరిస్థితి నిలకడగానే ఉందని ఆమె పేర్కొన్నారు.