Corona Virus: కరోనా ధాటికి మహిళల కంటే పురుషులే ఎక్కువగా బలవుతున్నారు... ఎందుకంటే..?

  • ప్రపంచవ్యాప్తంగా లక్ష దాటిన కరోనా మరణాలు
  • 50 నుంచి 80 శాతం మృతులు పురుషులే
  • ధూమపానం ప్రధాన కారణం అంటున్న అధ్యయనం
Men dies more than women due to corona

చైనాలోని వుహాన్ నగరంలో ఉద్భవించిన కరోనా వైరస్ రక్కసి అనేక దేశాలను గజగజలాడిస్తోంది. అగ్రరాజ్యం అమెరికా సైతం కరోనా వైరస్ దూకుడుతో బెంబేలెత్తుతోంది. ఒక్కరోజే 2000 మరణాలతో రికార్డు నమోదు చేసింది. అటు, ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, ఇంగ్లాండ్ వంటి పెద్ద దేశాలు కూడా అందుకు మినహాయింపు కాదు. అక్కడ కూడా ఈ ప్రాణాంతక వైరస్ మృత్యు ఘంటికలు మోగిస్తోంది. మొత్తమ్మీద ఇప్పటివరకు కరోనాతో ప్రపంచవ్యాప్తంగా మరణించినవారి సంఖ్య లక్ష దాటింది. అయితే, కరోనా వైరస్ ప్రభావంతో చనిపోతున్న వారిలో ఎక్కువగా పురుషులే ఉంటున్నారని ఓ అధ్యయనం వెల్లడించింది.

ప్రపంచం మొత్తమ్మీద నమోదైన మరణాల్లో 50 నుంచి 80 శాతం మంది పురుషులే కరోనాకు బలయ్యారు. ఈ రేటు భారత్ లోనూ గణనీయ స్థాయిలోనే ఉంది. భారత్ లో నమోదవుతున్న పాజిటివ్ కేసుల్లో 76 శాతం పురుషులే కాగా, మరణాల్లోనూ మగవారి శాతం 73గా ఉంది. పురుషులపై కరోనా తీవ్రస్థాయిలో పంజా విసరడానికి గల కారణాలను పరిశోధకులు ఓ అధ్యయనంలో వెల్లడించారు.

మహిళల కంటే పురుషులే ఇతర వ్యాధులతో ఎక్కువగా బాధపడుతుంటారని, ముఖ్యంగా, ధూమపానం కారణంగా వారిలో ఏదో ఒక ఊపిరితిత్తుల వ్యాధి ఉంటుందని వివరించారు. కరోనా వైరస్ ప్రధానంగా శ్వాస సంబంధిత వ్యవస్థను దెబ్బతీస్తుంది కాబట్టి, ఊపిరితిత్తులు బలహీనంగా ఉన్నవారు సులువుగా దీనికి లొంగిపోతుంటారని తెలిపారు. చైనాలో కొవిడ్-19 మరణాలు మహిళలకంటే పురుషుల్లో రెంట్టింపు సంఖ్యలో ఉన్నాయని గుర్తించారు. చైనాలో మహిళల్లో 3 శాతం మంది స్మోకింగ్ చేస్తారని, అదే పురుషుల విషయానికొస్తే 52 శాతం పొగతాగుతారని పరిశోధనలో తేలింది. ఈ వ్యత్యాసమే కరోనా మరణాల్లో పురుషులు ఎక్కువగా ఉండడానికి దారితీస్తోందని అధ్యయనవేత్తలు పేర్కొన్నారు.

ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా స్మోకర్లే ఎక్కువగా కరోనా బారినపడతారని వెల్లడించింది. అయితే, స్మోకింగ్ మాత్రమే కాకుండా అధిక రక్తపోటు, హృద్రోగాలు, మధుమేహం వంటి సమస్యలుంటే కరోనా బాధితులు కోలుకోవడం చాలా కష్టమని, అలాంటి వ్యక్తుల్లో మరణాల రేటు చాలా ఎక్కువగా ఉంటుందని ఇటలీ నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వివరించింది. ఇక గార్డియన్ పత్రిక కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించింది. 2003లో వచ్చిన సార్స్ వైరస్ భూతం కూడా ఇదే తరహాలో మహిళల కంటే పురుషులపైనే అధిక ప్రభావం చూపిందని వివరించింది.

మరో అధ్యయనం ఆసక్తికర అంశం వెల్లడించింది. సాధారణంగానే పురుషుల కంటే మహిళల్లో వ్యాధి నిరోధక శక్తి బలంగా ఉంటుందని, అందుకే వారు వైరస్ లతో సమర్థంగా పోరాడగలరని తెలిపింది. 100 ఏళ్లు, అంతకన్నా ఎక్కువ కాలం జీవిస్తున్న వారిలో 80 శాతం మహిళలేనని పేర్కొంది. జన్యువులే అందుకు కారణమని కొన్ని అధ్యయనాలు చెబుతున్నా, అది ఇంకా పరిశోధన దశలోనే ఉంది.

More Telugu News